వేసవి వచ్చిందంటే తెలుగు లోగిళ్లలో పచ్చళ్ల ఘుమఘుమలు వస్తుంటాయి. అయితే ఆవకాయ నిల్వ ఉండాలంటే అందులో పదార్థాల పాళ్లు ఎంత ముఖ్యమో, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం..
పచ్చళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయకూడదు. పింగాణీ లేదా గ్లాస్ జాడీల్లోనే నిల్వ చేయాలి. ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది పచ్చళ్లలో నూనె కాస్త తక్కువగా వేస్తుంటారు. కానీ నూనె, ఉప్పు పచ్చడిని ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ రెండింటిలో ఏది తక్కువైనా పచ్చడి పాడవుతుంది కాబట్టి పచ్చడికి తగ్గట్టుగా నూనె, ఉప్పు ఉండేలా చూసుకోవాలి.
పచ్చడి జాడీ లేదా సీసా మూతను గట్టిగా పెట్టి దానిపైన పేపర్ లేదా బట్టతో గట్టిగా కట్టిపెట్టుకోవాలి. దీనివల్ల తేమ లోపలకు వెళ్లదు. చాలా మంది జాడీలో నుంచి పచ్చడి తీసుకున్నాక స్పూను దానిలో ఉంచుతుంటారు. దీనివల్ల కూడా పచ్చడి త్వరగా పాడవుతుంది. ఎప్పుడు పచ్చడి తీసుకోవాలన్నా శుభ్రమైన, పొడి స్పూన్ వాడాలి. చెక్క స్పూను అయితే పచ్చడి పాడవకుండా ఉంటుంది.