శిశువులకు పాలు పట్టడంలో చాలా మంది తల్లులు తెలియని పొరపాట్లు చేస్తుంటారు. దాంతో చిన్నారులు అనారోగ్యం పాలుకావడం చూస్తుంటాం. మొదటి కాన్పు అయిన తల్లులు అనుభవం లేక, తెలియక చాలా తప్పులు చేస్తుంటారు. ఏ వయసులో ఉన్న పిల్లలకు ఎంత పరిమాణంలో పాలు పట్టాలి. పోషకాహారం ఇవ్వాలన్న విషయం ఇంట్లో పెద్దలను, వైద్యులను అడిగి తెలుసుకోవాలి.
ఎప్పుడైనా తల్లి పడుకొని పాలు పట్టకూడదు. అలా పట్టినా, వెంటనే నిద్ర పుచ్చకూడదు. దీనివల్ల పిల్లలు తాగిన పాలు కిందకు జారకుండా ముక్కులోకి వచ్చి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. తల్లి నేలపై కూర్చొని లేదా కుర్చీలో ఉండి పాలివ్వడం మంచిది. ఒడిలో బిడ్డను కూర్చోబెట్టుకుని పాలు పట్టినట్టయితే సులువుగా పొట్టలోకి వెళ్తాయి. పాలు పట్టిన వెంటనే నిద్రపుచ్చకుండా కనీసం 10 నుంచి 15 నిమిషాలు చేతిలోకి తీసుకొని భుజాన వేసుకోవాలి. చేతితో తల, వీపుపై జోకొడుతూ లాలిస్తుండాలి. ఈ విధంగా చేస్తే పాలు బాగా జీర్ణం అవుతాయి.