ఎండలో బయటకు వెళ్లి వచ్చామంటే చల్లగా ఉన్న నీరు తాగాలనిపిస్తుంది. వెంటనే ఇంట్లో ఫ్రిజ్ ఓపెన్ చేసి అందులోని నీరు తాగుతాం. అయితే వేసవిలో ఫ్రిజ్‌లోని చల్లని నీటి కంటే.. మట్టి కుండలోని నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. మట్టి కుండ సాధారణంగా ఒక ప్యూరిఫైయర్‌లా పని చేస్తుంది. నీటిలో ఉండే మలినాలను, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని వడకట్టి శుద్ధమైన మంచినీటిని కుండ అందిస్తుంది.
మట్టి కుండలో నీరు తాగితే జీవక్రియ రేటు పెరుగుతుంది. ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో అవసరమైన పీహెచ్ లెవల్స్‌ను మట్టికుండలోని నీరు సమతుల్యం చేస్తుంది. శరీరంలో ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. కుండలో నీరు తాగితే ఉదర సంబంధిత వ్యాధులు తగ్గడంతో పాటు అజీర్తి, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
ఈ నీటిని తాగితే ఇందులోని సహజ ఖనిజాలు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. మట్టి కుండలోని వాటర్ తాగడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. జలుబు, దగ్గు, శ్వాసకోస, ఆస్తమా వ్యాధులతో బాధపడే వారు ఫ్రిజ్‌లో నీటి కంటే కుండలోని నీరు తాగితే ఆరోగ్యానికి శ్రేయస్కరం.