మయోనైజ్ తయారీలో పచ్చి గుడ్లను వాడటం వల్ల సాల్మొనెల్లా అనే హానికర బ్యాక్టీరియా వృద్ధి చెంది వాంతులు, వికారంతో పాటు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. దీని తయారీలో కోడిగుడ్లు, నూనె, ఎక్కువ ఉప్పు కలిపి వాడటం వల్ల కొవ్వులు అధికంగా ఉంటాయి. దీన్ని తరచూ తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. మయోనైజ్ ఎక్కువగా తినే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 15 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. వీటిని తరచూ తింటే జీర్ణక్రియలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివిధ పదార్థాల్లో ఇష్టంగా తినే మయోనైజ్ తయారీకి గుడ్డులోని పచ్చ సొన, నూనె, నిమ్మరసం, ఉప్పు వాడతారు. దీని తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల అది ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది. అలాగే మయోనైజ్ ఉడికించని పదార్థం కావడంతో ఇందులో హానికర బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తయారు చేసిన 3, 4 గంటల్లోపే వాడాల్సి ఉండగా ఎక్కువ సమయం నిల్వ ఉంచడం వల్ల కూడా సమస్యగా మారుతోంది.