కదలకుండా అదే పనిగా కూర్చుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు
ఈ ఆధునిక కాలంలో మనుషుల్లో శారీరక శ్రమ బాగా తగ్గింది. తాజా టెక్నాలజీ, మెషిన్లు అందుబాటులోకి రావడంతో శారీరక శ్రమకు పెద్ద ఛాన్స్ లేకుండా పోయింది.
By అంజి Published on 6 Oct 2023 5:06 AM GMTకదలకుండా అదే పనిగా కూర్చుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు
ఈ ఆధునిక కాలంలో మనుషుల్లో శారీరక శ్రమ బాగా తగ్గింది. తాజా టెక్నాలజీ, మెషిన్లు అందుబాటులోకి రావడంతో శారీరక శ్రమకు పెద్ద ఛాన్స్ లేకుండా పోయింది. చిటికెలో ఎది కావాలంటే.. అది కాళ్ల దగ్గరకు వస్తోంది. ప్రస్తుత కాలంలో చాలా మంది ఒకే చోట కూర్చొని, ఎక్కువ సేపు పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఎక్కువ సేపు అదే పనిగా కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా మతిమరుపు, మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం, చిత్తచాంచల్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ సేపు కూర్చోవడం, అటూ ఇటూ తిరగకపోవడం వల్ల ఊబకాయం వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కూర్చోవడానికి అలవాటు పడిన వారు నడవటానికి ఇష్టపడరు, దీని కారణంగా తిన్న ఆహారానికి ఖర్చయ్యే క్యాలరీలకు పొంతన ఉండదు. దీని వల్ల పొట్ట, తొడ భాగంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, బర్న్ చేసే క్యాలరీలు తక్కువగా ఉండటం, వ్యాయామం లేకపోవడం వల్ల డయాబెటిస్, ఊబకాయం త్వరగా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు రోజూ వ్యాయామం చేస్తూ,.. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వాళ్లలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అలాగని పూర్తిగా వ్యాయామం మానేస్తే సమస్య తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే కదలకుండా కూర్చోవడం వల్ల మధుమేహం వస్తుంది.
కదలకుండా కూర్చొవడం వల్ల శరీరం ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయదు. రక్తంలోని గ్లూకోజ్‌ని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ సరైన మోతాదులో ఉత్పత్తి కాకపోతే మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా సేపు కూర్చోవడం వల్ల కొందరికి కాళ్లు వాపు వస్తాయి. ఎక్కువ సేపు కూర్చోకుండా చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి. లేదంటే శరీరంలోని కండరాలు కొవ్వు కరిగించవు, అలాగే బ్లడ్ సర్క్యూలేషన్ సరిగా జరగదు. వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఎక్కువ సేపు కూర్చొని ఉంటే డయాబెటిస్, మైగ్రేన్ లాంటి సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. శరీరానికి పనిచెబితే ఈ సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. డెస్క్ జాబ్స్ చేసేవాళ్లు ప్రతి గంటకు రెండు నుంచి ఐదు నిమిషాల పాటు విరామం తీసుకొని నడవాలి. దీని వల్ల మధుమేహం, ఊబకాయం, మైగ్రేన్తో పాటు జీవన శైలి సమస్యల బారిన పడకుండా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.