తల్లి కావడం అనేది ఒక మధురానుభూతి. తమ బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకొనేందుకు ప్రతి తల్లీ ఎదురుచూస్తుంది. దానికి తగ్గట్టే కొందరు బిడ్డకు జన్మనిస్తారు. అయితే మొదటిసారి తల్లైన ప్రతి మహిళా అప్పుడే ఎన్నో విషయాలు నేర్చుకుంటుంది. తను రెండోసారి జన్మనిచ్చే బిడ్డ కోసం పూర్తిగా సిద్ధమై ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో రెండోసారి గర్భం దాల్చడం చాలా మందిలో సమస్యగా మారింది. మొదటిసారి వచ్చినంత సులభంగా రెండోసారి గర్భం రావడం లేదు. దీన్ని వైద్యులు సెకండరీ ఇన్ఫెర్టిలిటీగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత ఈ సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ కనిపిస్తోంది.
దీనికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం వయస్సుతో పాటు తగ్గుతుంది. అందుకే రెండోసారి గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ హార్మోన్లు, అండాల ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే 35 సంవత్సరాలు దాటినప్పటి నుండి సెకండరీ ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పురుషులలో వయసు పెరిగే కొద్దీ జన్యుపరమైన సమస్యలు, ఫిట్‌నెస్ లేమి వంటి వివిధ కారణాల వల్ల స్పెర్మ్ సంఖ్య, వాటి నాణ్యత తగ్గిపోతుంది. పీసీఓఎస్, అధిక బరువు వంటివి కూడా గర్భదారణపై ప్రభావాన్ని చూపుతాయి.