నందనవనం టు ప్రశాంతి వనం.. ఓ టూర్ వెళదామా..?

Nandanavanam to Prasanthi vanam Newsmeter takes you on a tour of Telanganas Urban Parks.వారమంతా ఎంతో టెన్షన్ పడుతూ అలా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2022 5:32 AM GMT
నందనవనం టు ప్రశాంతి వనం.. ఓ టూర్ వెళదామా..?

వారమంతా ఎంతో టెన్షన్ పడుతూ అలా గడిపేస్తూ ఉంటాం. ఉద్యోగాలకు వెల్తూ, బిజినెస్ లు చేసుకుంటూ చాలా బిజీ బిజీ లైఫ్. కొన్ని సార్లు మనకంటూ కొంత సమయం కూడా కేటాయించలేకపోవచ్చు. పిల్లలతో కూడా సరదాగా గడపలేకపోతున్నామని అనిపిస్తూ ఉంటే.. వీకెండ్ లో ట్రిప్స్ వేయడం బెటర్. ప్రతి సారీ వేరే ఊళ్లకు వెళ్లడం కుదరకపోవచ్చు. మనకు దగ్గరగా ఉన్న పార్క్ లకు వెళితే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్‌తో పాటు మ‌న‌స్సుకు ప్ర‌శాంతత ల‌భిస్తుంటుంది. పనిభారం, ఒత్తిడితో నిండిన మనజీవితాల్లో వినోదం కేవలం లాంగ్ హాలిడేస్ సమయాల్లో మాత్రమే పరిమితం కాకూడదు, మన దైనందిన జీవితంలో భాగం కావాలి. మనస్సు, శరీరానికి విశ్రాంతిని ఇచ్చే ప్రదేశాల్లో పార్క్ కూడా ఒకటి.

ఉద్యానవనాలు ఆరోగ్యకరమైన, నాణ్యమైన జీవితాన్ని గడపడంలో సహాయపడతాయి. తెలంగాణలోని అర్బన్ ఫారెస్ట్ పార్కులు వన్యప్రాణులు, వృక్షజాలం, జంతుజాలానికి నిలయం. సేద తీరడం, ఆడుకోవడం వంటి ఎన్నో రకరకాల కార్యకలాపాలు అక్కడ చేయవచ్చు.

సందర్శకులు విశ్రాంతి తీసుకోవడానికి, రీఛార్జ్ అవ్వడానికి ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా తెలంగాణలోని అర్బన్ ఫారెస్ట్ పార్కులు మారాయి. వాటి జాబితా ఇక్కడ ఉంది.

1. మయూరి హరిత వనం, మహబూబ్ నగర్

లొకేషన్: https://goo.gl/maps/8cBYGN2RkJSFSp4X9

మహబూబ్ నగర్, జడ్చర్ల హైవే మధ్య ఉన్న మయూరి హరిత వనం రాష్ట్రంలోని అతిపెద్ద ఎకో-టూరిజం పార్కులలో ఒకటి. బటర్‌ఫ్లై గార్డెన్, రోజ్ గార్డెన్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, ఆస్ట్రో గార్డెన్, మకావ్ బర్డ్ ఎన్‌క్లోజర్, కరెన్సీ పార్క్, అవుట్‌డోర్ జిమ్, ఫ్లాగ్ పాయింట్, నేచర్ ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్, వాకర్స్ పాత్‌లు ఇందులో ఉన్నాయి. జిప్ లైన్, కమాండో టవర్, బ్యాంబూ బ్రిడ్జ్( వెదురు వంతెన), వాల్ క్లైంబింగ్, హ్యాంగింగ్ టైర్ బ్రిడ్జ్, నెట్ క్లైంబింగ్, ల్యాడర్ క్లైంబింగ్, రైఫిల్ షూటింగ్, విలువిద్య వంటి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకు అవసరమైన ఎంటర్టైన్మెంట్ ఈ పార్క్ లో లభిస్తుంది.

ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు తెరచి ఉంచుతారు.

మయూరి హరిత వనం ప్రవేశ ద్వారం


స్కై సైక్లింగ్


గ్రీన్ పార్క్ ప్రాంతం


సీతాకోకచిలుక పార్క్


రోప్ వాకింగ్


2. భాగ్యనగర్ నందనవనం

లొకేషన్: https://goo.gl/maps/LTC9K3JWsmz71CfN6

మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం, హైదరాబాద్-వరంగల్ రహదారికి దగ్గరగా ఉంటుంది. ఈ పార్క్ ప్రకృతి ప్రేమికులకు విజువల్ ట్రీట్. ఇందులో ఉన్న వాకింగ్ ట్రాక్, ఫారెస్ట్ ట్రాక్ వంటివి ప్రకృతి ప్రేమికులకు సరైన గమ్యస్థానంగా మారింది. వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, యోగా షెడ్, కానోపీ వాక్‌వే, వాచ్‌టవర్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పార్కులో జింకలు, నెమళ్లను కూడా చూడవచ్చు.

ఇది వాకర్స్ కోసం ఉదయం 5:30 నుండి 9 గంటల వరకు, సందర్శకుల కోసం 11.00 AM నుండి 6.00 PM వరకు తెరిచి ఉంటుంది.


పార్క్ వద్ద జింకలు


వాచ్ టవర్


(క్రెడిట్స్: walk4health)

3. గాంధారి వనం

లొకేషన్: https://goo.gl/maps/LVfTKEzadXRU2e116

మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ఉన్న ఈ పార్క్ కుటుంబ సమేతంగా గడపడానికి అనువైన ప్రదేశం. అర్బన్ పార్క్ 500 రకాల వృక్ష జాతులతో జీవవైవిధ్యానికి కేంద్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా, ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తుంటారు.

ఈ పార్క్ ఉదయం 10:00 నుండి రాత్రి 09:00 వరకు తెరిచి ఉంటుంది.

గాంధారి వనం పార్కు విహంగ వీక్ష‌ణం


పిక్నిక్ స్పాట్


పార్క్ ప్రవేశ ద్వారం



4. ప్రశాంతి వనం పార్క్

లొకేషన్: https://goo.gl/maps/GTz37MU3yVU5vSaL8

దూలపల్లి - బహదూర్‌పల్లి రోడ్‌లో ఉన్న ఈ పార్క్ 25 ఎకరాలలో విస్తరించి ఉంది. ఔషధ మరియు పూల తోటలతో నిండి ఉంది. చెట్ల జాతులలో మర్రి, రావి, పెల్టోఫోరం, ఉసిరి, చింత, వెదురు, నెమలినార, సీతాఫల్ మొదలైనవి ఉన్నాయి. ఈ పార్కులో వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, యోగా షెడ్ కూడా ఉన్నాయి.

వాకర్స్ కోసం ఉదయం 5.30 నుండి 9.00 వరకు, సందర్శకుల కోసం ఉదయం 11:00 గంటల నుండి 6:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

వాకింగ్ ట్రాక్




5. శాంతివనం పార్క్


లొకేషన్: https://goo.gl/maps/D8rLSXhZqz9tJpWHA

మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి మండలం చెంగిచెర్ల రోడ్డులో ఉన్న ఈ పార్కులో వేప, కానుగ, రేల, నెమలినార, సుబాబుల్ వంటి ప్రధాన జాతుల చెట్లు ఉన్నాయి. పార్క్‌లో వాకింగ్ ట్రాక్, హెర్బల్ గార్డెన్, ప్లే ఏరియా, ఓపెన్-ఎయిర్ జిమ్, గెజిబో, వాచ్‌టవర్, యోగా షెడ్ ఉన్నాయి.

వాకర్స్ కోసం ఉదయం 5.30 నుండి 9.00 వరకు, సందర్శకుల కోసం 11:00 నుండి 6:00 వరకు తెరిచి ఉంటుంది.

గెజిబో (gazebo)


వాకింగ్ ట్రాక్‌



6. కండ్లకోయ ఆక్సిజన్ పార్క్


లొకేషన్: https://goo.gl/maps/VkfFpdEJB7eJuaeZA

మేడ్చల్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న ఈ ఉద్యానవనం మర్రి, రావి, పెల్టోఫోరం, ఉసిరి, చింత, వెదురు, నెమలినార, సీతాఫల్ మొదలైన ప్రధాన జాతులకు నిలయంగా ఉంది. ఇందులో హెర్బల్ గార్డెన్, ఓపెన్-ఎయిర్ జిమ్, పిల్లల ఆట స్థలం, గెజిబో, వాచ్‌టవర్, యోగా షెడ్, ఫోటో పాయింట్లు ఉన్నాయి. ,

వాకర్స్ కోసం ఉదయం 5.30 నుండి 9.00 వరకు, సందర్శకుల కోసం ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 6:00 వరకు తెరిచి ఉంటుంది.

వాకింగ్ ట్రాక్‌


వాచ్ ట‌వ‌ర్‌


7. పంచవటి పార్క్

లొకేషన్: https://goo.gl/maps/RWJ2AFYEdA56dxsE7

రంగారెడ్డి జిల్లాలోని డొమ్‌నైర్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లో ఉన్న ఈ పార్క్ ఔషధ పరంగా ప్రసిద్ధి చెందిన మొక్కలకు నిలయం. అర్బన్ లంగ్ స్పేస్ గా కూడా చెప్పొచ్చు. ఈ పార్క్ లో నెమళ్ల సంఖ్య చాలా ఎక్కువ.

ఏరియ‌ల్ వ్యూ


ప్ర‌వేశ ద్వారం


థీమ్-ఆధారిత అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోడానికి, అక్కడికి వెళ్లిన వారి అనుభూతికి సంబంధించిన వివరాలను తెలుసుకోడానికి రాష్ట్రం అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌ను చూడండి. "అర్బన్ ఫారెస్ట్ పార్క్స్"(Urban Forest Parks) యాప్ యూజర్ల సమీపంలోని అర్బన్ పార్కులు, అటవీ ప్రాంతాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

ఫోటో క్రెడిట్స్: తెలంగాణ టూరిజం వెబ్‌సైట్

Next Story