నెత్తి మీద టోపీ, తెల్లని గడ్డం, ఎర్రని దుస్తులతో క్రిస్మస్ తాత ఎంత బావుంటాడో కదా? అందుకే పిల్లలందరికీ క్రిస్మస్ తాతయ్య అంటే చాలా ఇష్టం. అయితే మనం క్రిస్మస్ తాతా అని పిలిచే ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్. క్రీ.శ.280లో జన్మించారు. ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. పేదలన్నా చాలా కరుణ చూపేవారు. దైవ చింతన వల్ల 19వ ఏటే ఫాదర్ అయ్యారు. పక్కవారి సంతోషం కోసం బతకమని ఏసుక్రీస్తు నమ్మిన సిద్ధాంతాన్నే ఆయన కూడా విశ్వసించారు. పగలంతా దేశాటన చేస్తూ ప్రజల అవసరాలు తెలుసుకుని రాత్రుళ్లు గుప్తదానాలు చేసేవారు.
ఒకరోజు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఒక వ్యక్తి వారి పెళ్లిళ్లు చేయలేక కుమిలిపోయాడట. అది చూసిన నికోలస్ రహస్యంగా క్రిస్మస్ తాత వేషంలో వెళ్లి కిటికీలో నుంచి బంగారు సంచులు జార విడిచారట. అలా ఎంతో మందికి బహుమతులు ఇచ్చారట. ఇలా లక్షల మందిని సంతోషపెట్టిన ఆయన క్రీ.శ.342 డిసెంబర్ 6న లోకాన్ని వీడారు. ఈ రోజునే ఫీస్ట్ డేగా జరుపుకునేవారు. నిజానికి ఆయన ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్న ఆయన రూపం కూడా నిజం కాదు. 1920లో కోకాకోలా సంస్థ సృష్టించిన పాత్రను మనం క్రిస్మస్ తాతా అనుకుంటాం. కోకాకోలా వారి ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు ఆయన బొమ్మ ఉన్న టిన్‌లను ఫ్రీగా పంచారు.