ఫోన్‌ ప్యాంట్‌ జేబులో పెడుతున్నారా?.. అయితే ఇది మీ కోసమే

ఈ టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ ఫోన్‌ ప్రజల జీవితంలో నిత్యకృత్యమైపోయింది. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌ కనిపిస్తోంది.

By అంజి  Published on  27 Feb 2024 1:30 PM IST
Smart phone, pant pocket, health problems, Lifestyle

ఫోన్‌ ప్యాంట్‌ జేబులో పెడుతున్నారా?.. అయితే ఇది మీ కోసమే

ఈ టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ ఫోన్‌ ప్రజల జీవితంలో నిత్యకృత్యమైపోయింది. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌ కనిపిస్తోంది. తిండి, నీరు, నిద్ర లేకపోయినా ఉండగలుగుతారు కానీ.. ఫోన్‌ లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేరన్నట్టుగా కొందరు బాగా అలవాటు పడిపోయారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిత్యం ఫోన్‌ వాడితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అర చేతిలో ప్రపంచాన్ని చూపెడుతున్న స్మార్ట్‌ఫోన్‌.. మనకు తెలియకుండానే స్మార్ట్‌గా మన జీవితాన్ని ముంచేస్తోందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ లేకుండా ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు.

చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మొబైల్‌ ఫోన్లను చొక్కా, ప్యాంట్‌ పాకెట్లలో పెట్టుకుని వెళ్తారు. అలాగే సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌ కోసం ఫోన్‌ ఇంటర్నెట్‌ ఆన్‌ చేసి ఉంచుతారు. అయితే ఫోన్‌ను ప్యాంటు ముందు జేబు, చొక్కా జేబులో పెట్టుకుని ఎక్కువ సేపు ఉంచడం ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు సాధారణంగా బయటకు వెళ్లేటప్పుడు హ్యాండ్‌ బ్యాగ్‌ తీసుకెళ్తారు కాబట్టి ఫోన్‌ను బ్యాగ్‌లో ఉంచుతారు. పురుషులు మాత్రం ఫోన్‌ను ఎప్పుడూ ప్యాంట్‌ ముందు జేబులో ఉంచుతారు. కొంత మంది పెద్దవారు షర్ట్‌ ముందు జేబులో పెట్టుకుంటారు. ఫోన్‌ను ఈ రెండు చోట్ల ఉంచడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని అనేక అధ్యయనాల్లో తేలింది.

ప్యాంట్‌ జేబులో మొబైల్‌ ఫోన్‌ పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతున్నట్టు తేలింది. ఫోన్‌ నుంచి వచ్చే తరంగాలు వీర్యానికి మూలమైన స్పెర్మటోజోవా కణాల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తున్నట్టు కొన్ని పరిశోధనల్లో తెలిసింది. ఇవి స్పెర్మ్‌కు మూలం. వీర్య కణాల సంఖ్య, నాణ్యత తగ్గితే పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది. దీని వల్ల పురుషులు అనేక సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మొబైల్‌ ఫోన్‌ను ఆన్‌లో ఉంచుకుని, ఎప్పుడూ ప్యాంట్‌లో ఉంచుకునే పురుషులు, ఇతరులతో పోలిస్తే ఎక్కువగా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్టు మరో పరిశోధనలో తేలింది.

Next Story