ప్రస్తుత కాలంలో వంట గదిలో చిమ్నీ తప్పనిసరి వస్తువుగా మారింది. ఇది వంట చేసే సమయంలో పొగ, నూనె, కణాలు, ఇతర ధూళిని తొలగిస్తుంది. అలాగే వంటగదిలో వేడి పెరగకుండా నియంత్రిస్తుంది. అయితే నిత్యం దీన్ని వాడటం వల్ల తక్కువ సమయంలోనే జిడ్డుగా మారుతుంది. దీని వల్ల చిమ్నీ సామర్థ్యం తగ్గుతుంది. దాన్ని నిర్ణీత వ్యవధికోసారి శుభ్రం చేయకపోతే అందులోని ఫిల్టర్లు మూసుకుపోవడంతో పాటు చిమ్నీ, ఆ చుట్టుపక్కల పరిసరాలు ఆయిల్ మరకలతో అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. అదేలాగో ఇప్పుడు చూద్దాం..
చిమ్నీని శుభ్రపరిచే ముందు దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. తర్వాత చిమ్నీలోని అన్ని భాగాలను వేరు చేయాలి. ఫిల్టర్ చిమ్నీలో ముఖ్యమైన భాగం. ఇందులో ఎక్కువ మురికి ఉంటుంది. కాబట్టి ఫిల్టర్‌ను వేరు చేసి డిటర్జెంట్ లేదా వెనిగర్ వేసిన వేడి నీటిలో ఉంచాలి. అరగంట తర్వాత నూనె, ధూళిని తొలగించడానికి మృదువైన బ్రష్‌ని ఉపోగించి ఫిల్టర్‌ను పూర్తి స్క్రబ్ చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేసి ఆరబెట్టాలి. అలాగే మిగతా భాగాలను స్పాంజ్ ఉపయోగించి శుభ్రం చేయాలి. మొండి జిడ్డు ఉంటే బేకింగ్ సోడా పేస్ట్‌ను రాసి, అరగంట తర్వాత శుభ్రం చేయాలి. అన్ని భాగాలను పూర్తిగా ఎండబెట్టిన తర్వాత, వాటిని తిరిగి అమర్చాలి.