ఎండాకాలం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఇన్ని రోజులు మూలన ఉన్న కూలర్లను దుమ్ము దులిపి బయటకు తీస్తున్నారు. అయితే కొన్నిసార్లు కూలర్ నుంచి నీచు వాసన వస్తుంటుంది. దీని వల్ల చల్లదనం పక్కన పెడితే.. ఇల్లంతా ఒకటే దుర్వాసన వస్తుంది. ఇలా దుర్వాసన రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కూలర్ల నుంచి వాసన రావడానికి ప్రధాన కారణం బ్యాక్టీరియా, కూలర్ వాతావరణం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. కూలర్‌కు మూడు వైపులా ఉండే గడ్డి ప్యాడ్లలో దుమ్ము, ధూళి, ఇతర మలినాలు అన్నీ చేరి అవి మురికిగా మారతాయి. దీంతో ప్యాడ్లలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందుకే కూలింగ్ ప్యాడ్‌లు, ట్యాంక్, ఎయిర్ ఫిల్టర్‌లతో సహా ప్రతి భాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
ట్యాంక్‌లోని నీరు ప్రతి మూడు రోజులకు ఒకసారి మార్చితే బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. కూలర్‌ను రోజంతా వాడి ఆఫ్ చేసే ముందు 15 నిమిషాల పాటు నీటి సంపు వాడకుండా ఫ్యాన్ ఓన్లీ మోడల్ రన్ చేయండి. ఎప్పుడూ స్వచ్ఛమైన, శుభ్రమైన నీటిని ఉపయోగించండి. దీంతో కూలర్ నుంచి వాసన రాకుండా అరికట్టవచ్చు.