వివాహం ఆలస్యం కావడం, సంతాన సమస్యలు, కెరీర్ కారణాలతో కొంత మంది మహిళల్లో ప్రెగ్నెన్సీ ఆలస్యమవుతుంది. అయితే వయసు పెరిగే కొద్దీ మహిళల్లో గర్భధారణ సమస్యగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన మహిళలకు పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువని.. ఒక వేళ బిడ్డకు జన్మనిచ్చినా వారిలో అనేక శారీరక లోపాలకు అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మహిళల్లో 30 ఏళ్లు దాటిన తర్వాత నుంచి గర్భధారణలో కీలక పాత్ర పోషించే అండాల నాణ్యతలో క్షీణత కనిపిస్తుంది.
40 ఏళ్లు దాటాక ఈ క్షీణత మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ల ముప్పు 90 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే 35 నుంచి 45 ఏళ్ల మధ్య 25 శాతం, 30 ఏళ్లలోపు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ల ముప్పు 12 శాతంగా ఉంటుందని వెల్లడించారు. 40 దాటిన మహిళలకు ప్రెగ్నెన్సీ వస్తే గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ వయసులో గర్భం దాలిస్తే మహిళలకు హైబీపీ ముప్పు ఎక్కువ. ఇది ఒక్కోసారి తల్లి, గర్భంలోని బిడ్డకూ ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది. 40 ఏళ్ల వయసు దాటేసరికి కొంత మంది మహిళల్లో షుగర్, హైబీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి ఆ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే అవకాశాలు ఉన్నాయి. పిల్లల్లో కూడా అవయలోపం, ఇతర సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది. ఇలాంటి మహిళలు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.