ప్రస్తుత కాలంలో నగరాలకు వలస వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బెంగళూరు వంటి మహా నగరాల్లో నెలనెలా చెల్లించాల్సిన అద్దె కంటే రెంటల్ డిపాజిట్ కింద ఏకంగా 10 నెలల మొత్తం చెల్లించాల్సి వస్తోంది. దీంతో రెంటల్ డిపాజిట్‌పై ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకోవాలని అద్దెదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీరో రెంటల్ డిపాజిట్ తెర మీదకు వచ్చింది. ఇది అధిక అద్దె కలిగిన 2,3,4 బీహెచ్‌కే ప్రాపర్టీలకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ స్కీమ్‌లో ఏడాది అద్దె మొత్తంలో 6 శాతం చెల్లిస్తే చాలు.. ఉదాహరణకు ఓ ఇంటి అద్దె నెలకు రూ.25 వేలు అనుకుంటే పది నెలల మొత్తం అంటే రూ.2.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వాలి. అదే జీరో రెంటల్ డిపాజిట్ స్కీమ్ కింద రూ.15 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇంటి యజమానుల వాదన మరోలా ఉంది. ఒక వేళ తమ ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజీ జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని.. అలాంటి సందర్భంలో తాము నష్టపోకుండా ఉండటానికే ఎక్కువ మొత్తం డిపాజిట్‌గా తీసుకుంటున్నట్టు వారు చెబుతున్నారు. మరోవైపు నగరాల్లో అందుబాటు ధరల్లో, ఆఫీసులకు దగ్గరగా ఇళ్లు దొరకడం గగనమైపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు.