ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరుచునే ఆలయం.. అది కూడా అర్ధరాత్రే!
ఏ ఆలయాన్నైనా ఉదయాన్నే తెరచి పూజలు, అభిషేకాలు చేస్తారు. కేవలం గ్రహణ సమయాల్లో మాత్రమే ఆలయాన్ని మూసి ఉంచుతారు.
By అంజి Published on 28 Jan 2024 8:00 AM GMTఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరుచునే ఆలయం.. అది కూడా అర్ధరాత్రే!
ఏ ఆలయాన్నైనా ఉదయాన్నే తెరచి పూజలు, అభిషేకాలు చేస్తారు. కేవలం గ్రహణ సమయాల్లో మాత్రమే ఆలయాన్ని మూసి ఉంచుతారు. కానీ.. ఓ ఆలయాన్ని మాత్రం ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరుస్తారు. అది కూడా అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే.. వింతగా ఉంది కదూ.. మరి ఈ ఆలయం కథేంటో తెలుసుకుందాం..
ఒక్క అర్ధరాత్రి మాత్రమే తెరిచే ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీమహామకాళేశ్వర ఆలయంలోని రెండో అంతస్తులో ఉన్న శ్రీనాగచంద్రేశ్వర ఆలయం. ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. ఈ ఆలయంలో శివుడు, పార్వతి, నందితో పాటు పాము కూడా మంచంపై దర్శనం ఇస్తారు. శివుడి మెడ, భుజం మీద పాము చట్టుకుని ఉంటుంది. విగ్రహ రూపంలోని శంకర మహాదేవుడు భుజంపైన, మెడ చుట్టూ సర్పాలను ధరించి ఉంటాడు. అలాగే ఈ విగ్రహం పై భాగంలో సూర్యచంద్రులు కూడా కనిపిస్తారు.
శ్రావణ మాసంలో మాత్రమే..
ఈ నాగచంద్రేశ్వర ఆలయాన్ని ఏడాదిలో కేవలం నాగ పంచమి రోజు మాత్రమే తెరుస్తారు. అది కూడా శ్రావణ మాసంలో వచ్చే శుక్ల చతుర్థి తిథి రోజున అర్ధరాత్రి 12 గంటల నుంచి నాగపంచమి రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో మాత్రమే భక్తులు నాగేంద్ర స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆలయాన్ని అర్ధరాత్రి తెరిచినప్పటికీ భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గదు. సర్పాధిపతిగా పిలువబడే తక్షకుని విగ్రహాన్ని నాగపంచమి నాడు కొలిచేందుకు వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు.
పర్మర్ వంశానికి చెందిన భోజరాజు ఈ దేవాలయాన్ని 1050వ సంవత్సరంలో పునరుద్ధరించాడని స్థానికులు చెబుతున్నా. ఆ తర్వాత 1732వ సంవత్సరంలో మహాకాళ దేవాలయంతో ఈ దేవాలయానికి రాణాజీ సింధియా నూతన వైభవాన్ని తెచ్చారట. ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి సర్వ సర్పదోషాలు తొలగిపోతాయని చెప్తారు. నాగపంచమి నాడు లక్షలాదిగా భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం వెనుక ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు.