సీతాఫలం తినడం వల్ల కలిగే లాభాలు ఇవే
సీజనల్ పండ్లు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయా సీజన్లలో వచ్చే రోగాల నుంచి రక్షణ పొందవచ్చు.
By అంజి Published on 9 Oct 2024 12:15 PM IST
సీతాఫలం తినడం వల్ల కలిగే లాభాలు ఇవే
సీజనల్ పండ్లు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయా సీజన్లలో వచ్చే రోగాల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో సీతాఫలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి ధర కాస్త ఎక్కువగా అనిపించినా.. ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీతాఫలాన్ని నేరుగా తినడంతో పాటు జ్యూస్‌లు, స్మూతీలు, ఐస్‌క్రీంలు, మిల్క్‌షేక్‌లు, స్వీట్ల తయారీలో వాడతారు. వీటి గింజల నూనెను చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు.
సీతాఫలంలో విటమిన్ బీ, సీలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు, చర్మ కండరాలను బిగుతుగా ఉండేలా చూసేందుకు సాయపడతాయి.
క్యాన్సర్, గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గించడంలో సీతాఫలం సాయపడుతుంది.
సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించి గుండెను కాపాడతాయి.
ఈ ఫలంలో లభించే ఫైబర్ మలబద్ధకం, అతిసారం, జీర్ణాశయంలో మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఈ పండులో ఉండే క్యాటచీన్, ఎపిక్యాటచీన్, ఎపిగాలో క్యాటచీన్ లాంటి ప్లేవనాయిడ్లు క్యాన్సర్ నివారణకు ఉపకరిస్తాయి. మూత్రాశయం, రొమ్ము, పొట్ట, పెద్దపేగు క్యాన్సర్లను నిరోధించడంలో బాగా సహకరిస్తాయి.
అయితే సీతాఫలాలను పరిమితంగా మాత్రమే తినాలి. అతిగా తింటే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.