కంప్యూటర్ ముందు కూర్చొని మీ చేతిని సమాంతరంగా చాచినప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీకు అందేంత దూరంలో ఉంటే.. స్క్రీన్ మీకు చాలా దగ్గరగా ఉన్నట్టు అర్థం. ఇది కంటికి మంచిది కాదు. అందుకే మానిటర్‌ను కాస్త దూరంగా ఉంచి అవసరమైతే టెక్ట్స్ ఫాంట్ సైజ్ పెంచుకోవడం మంచిది. కంప్యూటర్ స్క్రీన్ కంటికి సమానంగా ఉండకూడదు. స్క్రీన్ చూడాలంటే మీ కళ్లను కాస్త కిందికి చూసేలా ఉండాలి. అప్పుడు కళ్లు తేమగా ఉంటాయి. కంప్యూటర్ స్క్రీన్‌ను ఎక్కువసేపు అదే పనిగా చూస్తుంటే కళ్లు పొడిబారిపోతాయి.
అందుకే కనీసం 20 నిమిషాలకోసారి ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఏ వస్తువైనా కనీసం ఇరవై సెకన్ల పాటు చూడాలి. అప్పుడు కళ్లు తేమను కోల్పోవు. రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్‌పై వర్క్ చేయాల్సి వస్తే ముందుగా కంటి వైద్యుని సలహాతో అవసరమైన కళ్లద్దాలను వాడటం మంచిది. దీని వల్ల భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మనం పని చేసే గదిలో లేదా ఆఫీస్ రూమ్‌లో ఉండే కాంతి కంటే కంప్యూటర్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉండాలి. చీకటిగా ఉన్న గదిలో పని చేస్తే స్క్రీన్ బ్రైట్‌నెస్ తక్కువగా ఉండాలి. దీన్ని పరిసరాల స్థితిని బట్టి మార్చుకోవాలి.