సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టండిలా
నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. దీంతో ఇల్లు, వాకిలి మాదిరిగానే ఆన్‌లైన్ ఖాతాలనూ అనుక్షణం కనిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది.
By - అంజి |
సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టండిలా
నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. దీంతో ఇల్లు, వాకిలి మాదిరిగానే ఆన్‌లైన్ ఖాతాలనూ అనుక్షణం కనిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా మనల్ని బురిడీ కొట్టించాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. వారివలలో చిక్కకుండా వుండాలంటే కొన్ని విషయాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి..అవేంటో చూద్దాం.
- అన్ని ఆన్ లైన్ ఖాతాలకు ఒకేరకమైన పాస్ వర్డ్, యూజర్ నేమ్ లు వాడడం మానండి. సాధారణంగా 52% మంది అవే వివరాలతో ఆన్‌లైన్ ఖాతాల్లో లాగిన్ అవుతుంటారనేది వెల్లడైంది. సైబర్ నేరగాళ్ల కళ్ళుకూడా వీళ్ళపైనే ఎక్కువగా ఉంటాయి.
- మన పాస్ వర్డ్ తెలుసుకోవడానికి హ్యాకర్లు అనుసరించే పద్ధతిని బ్రూటల్ ఫోర్స్ అటాక్ అంటారు. పాస్‌వర్డ్ కీలకాన్ని కనిపెట్టే వరకూ హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ సాయంతో ఎన్నెన్నో పాస్‌వర్డ్ కాంబినేషన్లతో ప్రయోగాలు చేస్తుంటారు. దీనికి చెక్ పెట్టాలంటే ప్రతి ఆన్ లైన్ ఖాతాకు విడివిడిగా బలమైన పాస్ వర్డ్ క్రియేట్ చేసుకుని .. వాటిని మరచిపోకుండా గుర్తుగా ఎక్కడైనా (ఫోన్లో కాకుండా) రాసుకోవాలి. ప్రతి రెండు, మూడు నెలలకొకసారి పాస్ వర్డ్ లను మారుస్తూ ఉండాలి.
- అంకెలు, అక్షరాలు, గుర్తులతో కూడిన సంక్లిష్ట పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవాలి.
- సోషల్ ఇంజనీరింగ్... సైబర్ నేరగాళ్లు ఐటీ నిపుణులుగా పరిచయం చేసుకోవచ్చు. పరికరాల్లోని భద్రత లోపాలను సరిచేయటానికి మన లాగిన్ వివరాలను అడగొచ్చు. వీటిని చెబితే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే. విశ్వసనీయమైనవిగా అనిపించే వెబ్‌సైట్లను సృష్టించటం కూడా సోషల్ ఇంజినీరింగ్‌లో భాగమే. అనుమానిత లింక్‌లు, అటాచ్‌మెంట్లను ఎప్పుడూ క్లిక్ చేయకుండా ఉండడమే దీనికి పరిష్కారం.
- ఎప్పుడూ సురక్షితమైన నెట్ కనెక్షన్లనే వాడుకోవాలి. పబ్లిక్ వైఫైలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీపీఎన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకుండా చూసుకోవాలి. మొబైల్ పరికరాల ద్వారా ఖతాల్లోకి సైన్ ఇన్ కావటానికి ఫేషియల్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్ ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవాలి.
- వైరస్‌లను నిలువరించే సాఫ్ట్‌వేర్‌లు లేని పరికరాల్లో హ్యాకర్లు కీలాగర్ లాంటి వైరస్ ని ఉద్దేశపూర్వకంగా జొప్పిస్తారు. మనకు తెలియకుండానే వ్యక్తిగత సమాచారాన్ని స్వాహా చేస్తారు.పరికరాల్లో నమ్మదగిన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- అనుమానిత సందేశాలను పంపించినవారి ఈమెయిల్ చిరునామాను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
- కేవైసీని సరిచేసుకోండి..లేకపోతే మీ బ్యాంకు ఖాతా నిలిపివేయబడుతుందంటూ లింక్ తో కూడిన ఫిషింగ్ మెస్సేజ్ లు వస్తుంటాయి. బ్యాంకులెప్పుడూ ఇలాంటి మెస్సేజ్ లు పంపవు. వాటి జోలికి వెళ్ళకుండా ఉండడమే దీనికి పరిష్కారం.