మామిడిపండ్లు అతిగా తింటున్నారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి..
By Knakam Karthik
మామిడిపండ్లు అతిగా తింటున్నారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి..
వేసవి వచ్చిందంటే ఎండలు ఓ రేంజ్‌లో దంచికొడతాయి. అదే సమయంలో అందరికీ ఇష్టమైన సీజనల్ మామిడిపండ్లు కూడా మార్కెట్‌లోకి వచ్చేస్తాయి. ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే విధంగా ఈ మామిడిపండ్లు దొరుకుతాయి. అయితే ఈ మామిడి పండ్లను డైరెక్ట్‌గానే కాకుండా జ్యూస్‌లు, షేక్‌లు చేసుకుని కూడా స్వీకరిస్తు ఉంటారు. అయితే ఈ పండ్లను తినడం వలన ఎన్ని మంచి ప్రయోజనాలు జరుగుతాయో.. తినేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యాల మామిడి..
మామిడి పండ్లలో దాగిన ఆరోగ్య రహస్యాలు రోగనిరోధక శక్తి పెరుగుతుంది మామిడిలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఈ పండు శరీరాన్ని బలపరచి, వైరల్, బ్యాక్టీరియా దాడులనుండి రక్షిస్తుంది. కంటి ఆరోగ్యం మెరుగవుతుంది విటమిన్ A అధికంగా ఉండే ఈ పండు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు తోడ్పాటు ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన మామిడి పండు జీర్ణవ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో దోహదపడుతుంది. హృదయ ఆరోగ్యానికి మేలు ఇందులో యాంటీఆక్సిడెంట్లు మరియు పొటాషియం ఉండటం వలన రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి మామిడి చాలా మంచిది. మెదడు స్థితి మరియు హార్మోన్ బ్యాలెన్స్ ఫోలేట్, విటమిన్ B6 లాంటి పోషకాల వలన మానసిక స్థితి మెరుగుపడుతుంది.
మామిడిపండ్లను ఎలా తీసుకోవాలి?
మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే మామిడిని కడగకండి. మొదట 25 నుంచి 30 నిమిషాలు నీటిలో నానబెట్టి, తర్వాత శుభ్రంగా కడగాలి. మామిడి పండును రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. రూమ్ టెంపరేచర్ వద్ద 5-7 రోజుల్లో అవి సహజంగా పక్వతకు వస్తాయి. వాటిని పేపర్‌తో కప్పితే వేగంగా పక్వానికి వస్తాయి. కానీ, సూర్యకాంతి తాకే ప్రదేశాల్లో ఉంచడం వల్ల పండు చెడిపోవచ్చు. ఇతర పండ్లతో కలిసి ఉంచకండి. అవి విడుదల చేసే ఇథిలీన్ వాయువు వల్ల మామిడులు త్వరగా పాడవుతాయి. ఒక వేళ ఫ్రిజ్‌లో నిల్వ చేయాలంటే పూర్తిగా పండిన మామిడిని మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టండి. తినే ముందు కనీసం అరగంట ముందే ఫ్రిజ్ నుంచి బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. చల్లారిన తర్వాత కోసుకుని తినడం వల్ల రుచీ, ఆరోగ్యం రెండూ మెరుగవుతాయి.
తిన్న తర్వాత చేయకూడని పనులు..
మామిడి తిన్న వెంటనే చల్లటి నీరు తాగకండి. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. పాలు మరియు మామిడి కలిపి తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపునొప్పి రావచ్చు. మామిడి తిన్న తర్వాత వేడిగా లేదా కారంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది కాదు. మామిడి తిన్న వెంటనే ఇతర పండ్లు తినకండి. ఇది గ్యాస్, అజీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. తిన్న వెంటనే నిద్రపోవడం లేదా వ్యాయామం చేయడం వంటి వాటికి దూరంగా ఉండండి. కనీసం 30 నిమిషాల విరామం అవసరం. మామిడి తీసుకునే సమయం మామిడి పండ్లు ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో తినడం ఉత్తమం. రాత్రి సమయాల్లో మామిడి తినడం జీర్ణక్రియను మందగిస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ తిన్న మామిడి అధిక చక్కెర కారణంగా బరువు పెరగడాన్ని ప్రేరేపించవచ్చు.