మనం రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోవాలంటే తల కింద వేసుకునే దిండు కూడా అనుకూలంగా ఉండాలి. అది సరిగా లేకుంటే నిద్రకు భంగం కలగడంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. దిండుపై తలను ఉంచినప్పుడు అది మెడ, తలకు సౌకర్యవంతంగా ఉండాలి. దిండు బాగా లావుగా ఉన్నా.. పలుచగా ఉన్నా నిద్ర సరిగా పట్టదు. దీని వల్ల మెడ నొప్పి లేదా భుజం నొప్పి వస్తుంది. మీకు పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉంటే కొంచెం లావుగా ఉన్న దిండును ఎంచుకోవాలి. వెల్లకిలా పడుకుంటే దిండు కాస్త పలచగా ఉన్నా సరిపోతుంది. వీటిని మీ సౌకర్యాన్ని బట్టి ఎంచుకోండి.
తల కింద వేసుకునే దిండుపై ఉన్న కవర్‌ను ఎప్పటికప్పుడు ఉతకాలి. దిండును కూడా మరీ ఎక్కువ కాలం వాడొద్దు. దిండు సరిగా లేకుంటే దానిపై మురికి, తలకు రాసుకునే నూనె అంటుకొని.. అది ముఖంపై మొటిమలకు కారణం అవుతుంది. దిండు సరిగా లేకుంటే రాత్రి పూట ఎక్కువసార్లు మెలకువ వస్తుంది. దిండుపై తల ఉంచినప్పుడు లోపలికి వెళ్లి.. నిద్ర లేచాక తిరిగి యథాస్థితికి రాకపోతే ఆ దిండుని మార్చడం మంచిది. కళ్ల దురద, ముక్కు కారడం, తుమ్ములు వంటివి కూడా దిండు కారణంగా వస్తాయి. అందుకే పిల్లో కవర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచండి.