బ్రేక్‌ఫాస్ట్ చేయట్లేదా..? ఆరోగ్యం బెడిసికొట్టుద్ది!
ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో చాలా మంది ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం, ఇప్పుడున్న చలికి ఆకలి వేయడం లేదని బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తుంటారు.
By Knakam Karthik Published on 11 Jan 2025 12:19 PM ISTబ్రేక్‌ఫాస్ట్ చేయట్లేదా ఆరోగ్యం బెడిసికొట్టుద్ది!
ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో చాలా మంది ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం, ఇప్పుడున్న చలికి ఆకలి వేయడం లేదని బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తుంటారు. అప్పుడప్పుడు అల్పాహారం స్కిప్ చేస్తే ఏమో కానీ, కొంతకాలం కంటిన్యూ అయితే ఆ ప్రభావం ఆరోగ్యంపై చూపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం ప్రతి ప్రాణికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. రోజులో మూడు పూటలు ఆహారం మితంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్యాలను దరి చేరనీయకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రోజులో ఏదైనా ఒక పూట ఆహారం తీసుకోకపోతే అది శరీరానికి అంత తొందరగా ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలం ఇలానే కంటిన్యూ చేస్తే బాడీపై ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ విషయంలోనూ అవే పొరపాట్లు చేస్తుంటారు. వివిధ కారణాల వల్ల అల్పాహారం తినకపోవడం లాంటిది చేస్తుంటారు. అసలు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉంటే మన బాడీలో ఏం జరుగుతుంది?
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం కారణంగా శరీరంలో అనేక సమస్యలు వస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఉదయాన్నే ఏం తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవ్వొచ్చని కొందరు అనుకుంటారు. వాస్తవానికి బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉంటే బరువు పెరగడంతో పాటు, ఇతర సమస్యలకు మనకు మనమే దారి వేసుకున్నట్లు న్యూట్రీషన్స్ చెబుతున్నారు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తింటే గ్లైకోజెన్, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని అధ్యయనాల్లో వెల్లడైందని న్యూట్రీషన్స్ చెబుతున్నారు. రోజు ప్రారంభంలో మొదటగా తీసుకునే అల్పాహారమే మెటబాలిజానికి ఎనర్జీని అందిస్తుంది. ఆ రోజంతా శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల నీరసం దరి చేరుతుంది. కానీ ఆకలి ఎక్కువగా ఉందని కొందరు మధ్యాహ్న భోజనంలో స్వీట్లు, ఆయిల్ ఫుడ్స్‌ను తీసుకుంటారు. వాటిలో అధిక కేలరీల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసిన వారు టైప్-2 మధుమేహం బారిన పడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. వారం మొత్తం టిఫిన్ తినని మహిళలు అధిక సంఖ్యలో మధుమేహంతో ఇబ్బందిపడుతున్నారు. ఆహారం జీర్ణం అయ్యేందుకు జీర్ణ వ్యవస్థ ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఒక వేళ ఉదయాన్నే ఏం తినకుండా ఉంటే ఆ ఆమ్లాలకు పని లేకుండా పోతుంది. దాంతో పాటు గ్యాస్ సమస్య తలెత్తుతుంది. ఖాళీ కడుపుతో ఉండటం వలన హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం కారణంగా ముఖ్యంగా మహిళల్లో నెలసరి క్రమం తప్పుతుందని అధ్యయనంలో తేలింది. రోజూ అల్పాహారం తీసుకోకపోతే మతి మరపుతో పాటు కోపం, చిరాకు, అసహనం కలుగుతాయి.
ఒక్క బ్రేక్ ఫాస్ట్ బాడీలోని అన్ని వ్యవస్థలపై ప్రభావం చూపిస్తుందనడంలో డౌటే లేదనిపిస్తుంది. ఎందుకంటే శరీరానికి తగిన పోషకాలు అందవని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్ చేయకుండా ఇంటి పనులు చేసుకోవడం, ఆఫీసులకు వెళ్లడం వంటివి తరచూగా కొనసాగితే ఏకాగ్రతను కోల్పోయి, చేసే పనిలో ప్రొడక్టివిటీ తగ్గుతుదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ డైయిలీ లైఫ్‌లో కచ్చితంగా యాడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.