చాలా మంది దాహం ఎక్కువగా ఉంటే తప్ప నీటిని తాగడానికి అంత ఆసక్తి చూపరు. అయితే శరీరంలో జీవ ప్రక్రియ సక్రమంగా జరగడానికి తగినంత నీరు తాగుతుండాలి. వాతావరణం చల్లగా ఉందని నీటిని పూర్తిగా పక్కనపెట్టేస్తే శరీర పనితీరు దెబ్బతింటుంది. నీళ్లు సరిపడినన్ని తాగకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం..
నీరు తగినంత తాగకపోతే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీని వల్ల చర్మం తేమను కోల్పోయి పొడి బారుతుంది. ఇదే సమస్య ఎక్కువ కాలం ఉంటే తామర, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. నీరు తక్కువగా తాగితే చిన్నతనంలోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. నీరు తక్కువగా తాగితే రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్ల ముప్పు పెరిగే అవకాశం ఉంటుంది. మూత్ర పిండాలు సరైన రీతిలో పని చేయవు.
దీర్ఘకాలంలో మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో పాటు కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరగడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మలబద్ధక సమస్య పెరుగుతుంది. సరిపడా నీళ్లు తాగకపోతే భవిష్యత్తులో తీవ్రమైన జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. డీహైడ్రేషన్ మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి.