'జైసల్మేర్‌'.. ఫేమస్‌ టూరిస్ట్‌ స్పాట్‌

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నిత్యం యాత్రికులతో సందడిగా ఉంటుంది. చారిత్రక కోటలు, రిచ్‌ హెరిటేజ్‌ టూరిస్ట్‌లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

By అంజి  Published on  3 March 2025 1:30 PM IST
famous tourist spot, Jaisalmer, Rajasthan

'జైసల్మేర్‌'.. ఫేమస్‌ టూరిస్ట్‌ స్పాట్‌

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నిత్యం యాత్రికులతో సందడిగా ఉంటుంది. చారిత్రక కోటలు, రిచ్‌ హెరిటేజ్‌ టూరిస్ట్‌లను విశేషంగా ఆకట్టుకుంటుంది. అత్యంత ప్రసిద్ధి గాంచిన జైసల్మేర్‌ కోటను.. క్రీస్తుశకం 1156లో భాటి వంశం రాజైన జైసల్‌ దేవ్‌జీ నిర్మించారు. అప్పటి రాజులు పోయినా.. వాళ్లు కట్టించిన జైసల్మేర్‌ కోట ఇప్పటికీ కళకళలాడుతుంటుంది. కోటలోని జైన మందిరాల శిల్పకళ ఎలాంటి వారినైనా మంత్రముగ్ధులను చేస్తుంది. జైసల్మేర్‌ నగరమంతా అందమైన హవేలీలలో అలరారుతూ ఉంటుంది. ఇక్కడి ఏ కట్టడమైనా స్థానికంగా దొరికే పసుపుపచ్చని రాయితో కట్టడం వల్ల నగరమంతా ఎండలో ఉండే బంగారంలాగా మెరిసిపోతూ ఉంటుంది. అందుకే దీన్ని గోల్డెన్‌ సిటీ అని పిలుస్తారు.

జైసల్మేర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో కుల్దర్‌ అనే ప్రాంతంలో మనుషులే ఉండరు. వందల ఏళ్ల క్రితం ఆ చుట్టుపక్కల 84 గ్రామాల్లో ఒకే కులం వారు ఉండేవారట. ఆ ఊర్లోని ఓ అందమైన అమ్మాయిని జైసల్మేర్‌ రాజ్య సైన్యాధికారి సాలమ్‌ సింగ్‌ ఇష్టపడ్డాడు. వివాహం చేసుకుంటానని కబురుపెడితే.. కట్టుబాట్లకు విలువనిచ్చే ఆ కులం వారు దానికి ఒప్పుకోలేదు. దాంతో ఆగ్రహించిన సైన్యాధికారి నెలరోజుల వ్యవధి ఇచ్చి ఆ లోపు పెళ్లి చేయకపోతే బలవంతంగా పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు.

దీంతో ఆ ఊరి పెద్దలందరూ ఆలోచించి గడువుకు ముందుగానే పిల్లాపాలతో, తట్టాబుట్టా సర్దుకుని 84 ఊర్లు ఖాళీ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. అలాగే ఇక్కడి ఇసుక దిబ్బలు మన దేశ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులకు సైతం విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఇసుక దిబ్బలపైకి ఎక్కి సూర్యాస్తమయం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవనే చెప్పొచ్చు. అంత అందమైన సూర్యాస్తమయం మనకు ఇక్కడ దర్శనమిస్తుంది.

Next Story