కనుమ పండుగ ప్రత్యేకత ఇదే
సంక్రాంతి అంటేనే సందడి. చిన్నా పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటు చేసుకునే ఈ పండుగలో చివరి రోజు పండుగే ఈ కనుమ.
By అంజి Published on 16 Jan 2024 4:11 AM GMTకనుమ పండుగ ప్రత్యేకత ఇదే
సంక్రాంతి అంటేనే సందడి. చిన్నా పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటు చేసుకునే ఈ పండుగలో చివరి రోజు పండుగే ఈ కనుమ. కనుమ పండుగ రైతన్నలకు అత్యంత ఇష్టమైనది. ఈ రోజు వారికి ఏ లోటు లేకుండా పాడిని అందించే గోమాతతో పాటు ధాన్యం రాశులను ఇంటికి చేర్చే బసవన్నలను అలంకరించి పూజలు చేస్తారు. ఈ రోజుల పశువులతో ఎలాంటి పని చేయనివ్వరు. ఇవాళ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభల తీర్థం నిర్వహిస్తారు. దూరపు ప్రయాణాలు చేయడం మంచిది కాదని విశ్వసిస్తారు.
సంక్రాంతిని సాగనంపేందుకు గుర్తుగా ఈ రోజున ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. మొదటి రెండు రోజుల పండుగ మనం చేసుకుంటే.. మూడో రోజు కనుమ పండుగను పితృదేవతలని స్మరించుకోవడానికి, మన చుట్టూ ఉన్న ప్రకృతి, మనకు సహాయం చేసిన పశువుల, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటాం..
పశువుల అలంకరణ
ఈ రోజు పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వా.. పంటలకు చీడ పురుగులు సోకకుండా ఉండేందుకు పొలంలో చల్లుతారు. ఆ తర్వాత పశువుల కొట్టాలను శుభ్రం చేసి, పశువులకు స్నానం చేయించి ఎద్దుల కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాలకు పట్టుబట్టలు, కాళ్లకి గంటల గజ్జలు, మెడలో పూలదండలు వేసి పశువులని అలంకరిస్తారు.
ఇంట్లో మనుషుల్లో పశువులు
ఈ రోజు పశువులను కూడా ఇంట్లో మనుషులుగా చూసుకుంటూ వాటికి పిండి వంటలతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఉప్పు చెక్క తినిపిస్తారు. అలాగే పక్షుల కోసం గింజలను ఇంటి ఆవరణలో చల్లుతారు. పంట చేతికి రావడానికి సహాయం చేసిన అందరినీ పిలిచి బట్టలు, కానుకలు ఇస్తారు.
తిరుగు ప్రయాణం చేయనివ్వరు
సంక్రాంతికి ఇంటికి వచ్చిన ఆడపడుచును, కొత్త అల్లుళ్లను తిరుగు ప్రయాణం చేయనివ్వరు. కమ్మని మినపగారెలు, మాంసాహారాన్ని వండి పెడతారు. ఇంట్లోని పిల్లలు గాలి పటాలు ఎగురేస్తుంటారు. కొన్ని పల్లెటూర్లలో కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున ఎడ్ల బండి పోటీలు, కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ఇలా ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో ఊర్లన్నీ కోలాహలగా, సందడిగా కనిపిస్తాయి.