సంక్రాంతి పండుగ ముగ్గులకు ఎందుకంత ప్రాధాన్యం ఉందో తెలుసా?
సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మహిళలు వేసే రంగురంగుల ముగ్గులు. పండుగ నెల వచ్చిందంటే ఏ ముగ్గు వేయాలా అని వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు.
By అంజి Published on 10 Jan 2024 5:30 AM GMTసంక్రాంతి పండుగ ముగ్గులకు ఎందుకంత ప్రాధాన్యం ఉందో తెలుసా?
సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మహిళలు వేసే రంగురంగుల ముగ్గులు. పండుగ నెల వచ్చిందంటే ఏ ముగ్గు వేయాలా అని వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ధనుర్మాస ఆరంభం నుంచి ఉత్తరాయణ ప్రవేశం వరకు మహిళలు వాకిలి నిండుగా రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ముఖ్యంగా పండుగ మూడు రోజులు.. భోగి మొదలు కనుమ దాకా రోజూ తీరొక్క ముగ్గులతో వాకిళ్లను అలంకరిస్తారు. మరి ఈ పండుగ సందర్భంగా వేసే ముగ్గులకు ఎందుకంత ప్రాధాన్యం ఉందో తెలుసుకుందాం..
సంక్రాంతి వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలో వాకిళ్లన్నీ ముగ్గులతో కళకళలాడుతుంటాయి. తెలుగు, కన్నడ భాషల్లో ముగ్గు అని, తమిళం, మయలాళ భాషల్లో కోలమ్, హిందీలో రంగోలీ అని పిలుస్తారు. తమిళ సంస్కృతిలో తొలిసారిగా ముగ్గు గురించి మధ్య యుగానికి చెందిన ఆండాళ్ అనే కవయిత్రి ప్రస్తావించారు. ముగ్గులు, మహిళల మధ్య సంబంధాన్ని వివరించారు. మహిళల ధార్మిక క్రతువులో రంగవల్లులు ఒక భాగమని చెప్పారు.
సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు.. ముగ్గులూ వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు, ఆ గొబ్బిళ్ల మీద ముళ్లగోరింట, గుమ్మడిపూలు.. ఇవీ పల్లెటూళ్లలో ప్రతి ఇంటా కనిపించే దృశ్యాలు, ముగ్గుల మధ్యన ఆవుపేడతో ముద్దలు చేసి, వాటికి పసుపు కుంకుమలు పెట్టి గుమ్మడి, బంతి, చామంతి వంటి పుష్పాలను గుచ్చుతారు. వాటినే గొబ్బెమ్మలంటారు. హేమంత రుతువులో సూర్యుడు, భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలను పెట్టడం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది.
ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్మాత్మిక లాభాలెన్నో ఉన్నాయి. నిత్యం ఇంటి ముందు, వెనుక, తులసి మొక్క వద్ద, దీపారాధన చేసే చోట ముగ్గులు వేయాలని పెద్దలు చెప్పేవారు. ముగ్గు ధనధాన్యాలను, దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుందని వారు నమ్మేవారు. గడప ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా, ఇంట్లో ఉన్న లక్ష్మీదేవీని బయటకు వెళ్లకుండా చూస్తాయని మన పూర్వీకుల నమ్మకం. ఏ పూజలోనైనా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి, దానికి నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీస్తారు.
సాంప్రదాయమైన పూజలు, మతరమైన కార్యక్రమాలు, శుభకార్యాలు తదితర కార్యక్రమాల్లో తప్పనిసరిగా ముగ్గులు వేసే వారు మన పూర్వీకులు.. ఎప్పటి నుంచి అంటే క్రీ.పూ 8వ శతాబ్దం నుంచి అన్నమాట. హరప్పా, మొహంజదారో, సింధు నాగరికత కాలంలో కూడా ముగ్గులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ఈ గుహలలో ఉన్న రంగురాళ్లను సున్నం పిండిరూపంలోకి కొట్టి, వీటి ద్వారా కొన్ని పినముట్లను, పాత్రలను, ఆయుధాలను తయారు చేసుకునేవారు. ఆ వస్తువులు తయారు చేసుకోగా మిగిలిన పొడి లేదా రజనుతో తాము నివసించే గోడలపై రంగుపొడులతో చిత్రాలాను, జంతువుల బొమ్మలను చిత్రించేవారు.