ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చడంలో నిమ్మకాయ తన వంతు సహాయం చేస్తుంది. దీంట్లో ఉండే 'సీ' విటమిన్ శరీరానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అంతే కాదు దీన్ని ఆయుర్వేదంలోనూ వాడుతారు. ఇన్ని లక్షణాలు ఉన్న నిమ్మకాయ ఎక్కడ పుట్టింది. దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
హిమాలయాలే పుట్టినిల్లు
పుల్లని పండ్లు, నిమ్మ జాతికి చెందిన చెట్లకు మన దేశంలోని హిమాలయాలే పుట్టినిల్లు అని శాస్త్రవేత్తలు తేల్చారు. లక్షల సంవత్సరాల క్రితమే హిమాలయాల్లో ఇవి ఉన్నాయని గుర్తించారు. సిట్రస్ పండ్ల డీఎన్‌ఏ ఆధారంగా తూర్పు అస్సోం, ఉత్తర మయన్మార్, పశ్చిమ యూనాన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవని తెలిసింది.
తడి వాతావరణం
పూర్వ కాలంలో నిమ్మ జాతి మొక్కలు తడి వాతావరణంలో పెరిగేవి. వాతావరణ మార్పులతో సిట్రస్ పండ్లలో ఒక్కసారిగా జీవపరిణామం సంభవించింది. దీంతో హిమాలయ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించాయి.రేడియేషన్ కారణంగా తడి వాతావరణం నుంచి పొడి వాతావరణంలోనూ పెరిగేలా ఈ చెట్లు మార్పు చెందాయి.
నిమ్మలో రకాలు
నిమ్మలో 50 జాతులు ఉన్నాయి. తియ్యని నారింజ నుంచి చేదు నిమ్మకాయల వరకు అన్నింటినీ సిట్రస్ పండ్లగానే భావిస్తారు.
మార్పులు ఇవే
సిట్రస్ పండ్ల వైవిధ్యం, జన్యు సంబంధాలను అర్థం చేసుకోవడం వల్ల శాస్త్రవేత్తలు కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. దీంతో ఒకప్పుడు తడి వాతావరణంలో మాత్రమే పెరిగిన సిట్రస్ చెట్లు ఇప్పుడు మన ఇంటి పెరట్లో, చిన్న చిన్న కుండీలలో కూడా పెంచుకునేలా అభివృద్ధి చేశారు.