మామిడి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
వేసవి వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి మామిడి పండ్లపైనే ఉంటుంది. ఈ సీజన్‌లో మాత్రమే లభించే ఈ తియ్యని పండును తినేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.
By అంజి Published on 14 May 2024 4:19 PM ISTమామిడి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
వేసవి వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి మామిడి పండ్లపైనే ఉంటుంది. ఈ సీజన్‌లో మాత్రమే లభించే ఈ తియ్యని పండును తినేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. మామిడి పండ్లు తియ్యని రుచితో పాటు అనేక రకాల పోషకాలను మనకు అందిస్తాయి. అందుకే మామిడిని ఫలాల్లో రారాజుగా చెబుతారు. ఇందులో విటమిన్ -ఏ,బీ,సీ,కే ఉంటాయి. మామిడిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, కలెక్టర్ మామిడి కాయల రకాలకు డిమాండ్ ఉంది. ఎక్కువ మంది ఇష్టంగా తినే రకం మాత్రం బంగినపల్లి. మన దేశంలో 100కుపైగా మామిడి పండ్ల రకాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో దొరికే మామిడి పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ఆరోగ్య ప్రయోజనాలు
మామిడి పండు తినడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు దూరం అవుతాయి. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా మారుతుంది. మామిడి పండు అజీర్ణం, అరుగుదల సరిగా లేకపోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల రక్త హీనత సమస్యతో బాధపడేవారు మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాని పొందవచ్చు.
మామిడి పండులో బిటాకెరోటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని బలోపేతం చేస్తుంది. మామిడిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే ఈ పండ్లను హైబీపీ ఉన్న వారు తినొచ్చు. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. వీటికి కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. మయోకార్డియల్ డ్యామేజ్, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే గుణం మామిడి పండులో ఉంది. ఎముకలు, చర్మం, కాలేయం, కంటి ఆరోగ్యానికి మామిడి మేలు చేస్తుంది. మధుమేస్త్రహం రాకుండా మామిడి కాపాడుతుంది. కానీ, షుగర్ పేషెంట్స్ మామిడి పండును తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. మామిడి పండ్లను ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. కొందరిలో అలర్జీ కలిగించే అవకాశం కూడా ఉంది.