మజ్జిగ లేదా లస్సీ ఎల్లప్పుడు శ్రేయస్కరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. గ్యాస్, మలబద్ధకం, మంట లాంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి మినరల్స్ సమతుల్యంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎండకాలంలో మజ్జిగ తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు. సాధారణంగా వర్షకాలం, చలికాలంలో కన్న.. వేసవి కాలంలో మజ్జిగ వినియోగం పెరుగుతుంది, ఎందుకంటే ఇది వేడి నుండి చాలా అవసరమైన ఉపశమనం కలిగిస్తుంది.
వడదెబ్బ తగలకుండా ఉండటంతో పాటు అధిక దాహాం తీరుతుంది. మజ్జిగలో జీలకర్ర, సబ్జా గింజలు, ధనియాలు, ఉప్పు కలుపుకుని తింటే ఇంకా మంచిది. మజ్జిగ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు బ్యాక్టీరియాను తగ్గించి గ్యాస్ట్రీక్ సమస్యలు రాకుండా చేస్తుంది. భోజనంలో మజ్జిగను కలుపుకొని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మజ్జిగ తాగిన తర్వాత ప్రశాంతత, తాజాదనం కలుగుతాయి. దాని చల్లని, విశ్రాంతి గుణాలు మీ మనస్సును ఉత్సాహంగా ఉంచుతాయి. మధ్యాహ్నం పూట మజ్జిగ తాగడం వల్ల మీ పోషకాహార శక్తిని పెరిగి.. మీరు తాజాగా, ఉత్సాహంగా ఉంటారు.