ఆ అందమైన నగరానికి అంత పెద్ద పేరేలా వచ్చిందో తెలుసా?
Do you know bangkok original name. బ్యాంకాక్.. ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది బీచ్‌లు, థాయ్ మసాజ్‌లు, అందమైన అమ్మాయిలు. థాయిలాండ్ దేశ రాజధాని
By అంజి Published on 1 Aug 2022 9:38 AM GMTబ్యాంకాక్.. ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది బీచ్‌లు, థాయ్ మసాజ్‌లు, అందమైన అమ్మాయిలు. థాయిలాండ్ దేశ రాజధాని అయిన బ్యాంకాక్ నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మనం సింపుల్‌గా బ్యాంకాక్ అంటాం. కానీ దాని అసలు పేరు తెలిస్తే వామ్మో అనాల్సిందే. ఒకవేళ కష్టపడి మొత్తం పేరు చదివినా చివరికి ఆయాసం రావడం పక్కా.
చదవడానికి ఇబ్బందిగా ఉండే బ్యాంకాక్ అసలు పేరును మీరు చదివేయండి. 'క్రుంగ్ థెప్ మహా నాఖోన్ అమోన్ రతన కోసిన్ మహింత్రయుత్తయ మహ దిలోక్ పోప్ నప్ప రాట్ రటచా థాని బురి రోమ్ ఉడొమ్ రటాచ నివెట్ మహా సతాన్ అమోన్ ఫిమన్ అవటాన్ సట్‌హిట్ సఖ తాట్టియా విట్సనుకమ్ ప్రసిట్'. ప్రస్తుతం ఇంతపొడవు పేరున్న ఈ నగరాన్ని ప్రపంచ దేశాలు బ్యాంకాక్ అనే పిలుస్తాయి. స్థానికులు మాత్రం ఈ పొడవు పేరును కుదించి 'క్రుంగ్ థెప్ మహా నిఖోన్', 'క్రుంగ్ థెప్' పిలుచుకుంటారు. అత్యంత పొడవైన పేరు కలిగిన నగరంగా బ్యాంకాక్ గిన్నిస్ బుక్‌లోనూ చోటు సంపాదించుకుంది.
బ్యాంకాక్ అసలు పేరును పాలి, సంస్కృత భాషల్లోని పదాలతో కలిపి పెట్టారు. దీనికి అర్థం 'దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, తొమ్మిది రత్నాల అద్భుతమైన నగరం, చక్రవర్తి సింహాసనం, రాజభవంతుల నగరం, మానవ రూపంలో అవతరించిన దేవతల ఇల్లు, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరం' అని. బ్యాంకాక్‌కు ఈ పేరును 1850లో కింగ్ మాంగ్‌కుట్ మహారాజు పెట్టారు. పూర్వం పల్లెటూరుగా ఉన్న బ్యాంకాక్‌ను 15వ శతాబ్దంలో ఆయుత్తయ రాజులు నగరంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. అప్పటి నుంచి ఆయా రాజులు చావో ఫ్రాయా నది తీరంలో ఉన్న బ్యాంకాక్‌ను ప్రధాన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. 1782లో కింగ్ రామ-1 బ్యాంకాక్‌ను రాజధానిగా మార్చుకున్నాడు. ఆయన హయాంలో బ్యాంకాక్‌ను 'క్రుంగ్ థెప్ తవరవాడి సి ఆయుత్తయ' అని పిలిచేవారు.