మనలో చాలా మందికి ఉదయం టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. రోజూ 'టీ' తాగకుండా కొందరు ఉండలేరు. మరికొందరు సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడే టీ లేదా కాఫీ తాగుతారు. 'టీ' తయారు చేయడం, తాగడం అంటే చాలా మందికి ఇష్టమే. అయితే 'టీ'ని తయారు చేసేటప్పుడు ఎక్కువసేపు మరిగించడం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. అతిగా మరిగించడం వల్ల పాలతో తయారు చేసిన 'టీ' వల్ల లభించే శక్తి తగ్గిపోతుందట. 'టీ'ని నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువసేపు మరిగిస్తే.. శరీరంలోకి చేరిన ఐరన్‌ను శరీరం గ్రహించలేకపోతున్నట్టు నిపుణులు గుర్తించారు.
ఎక్కువగా మరిగించిన 'టీ' తాగితే జీర్ణ సమస్యలు, కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'టీ'ని అతిగా మరిగిస్తే అన్ని పోషకాలు పోతాయి. అలాగే ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలలోని కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి పోతాయి. ఇలా అన్ని రకాల పోషకాలను కోల్పోయిన 'టీ'ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే 'టీ'ని 3 నుంచి 5 నిమిషాల మధ్య మరిగించడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.