సినిమా చూస్తూ భావోద్వేగ సన్నివేశాలకు కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తులను సమాజంలో 'ఎమోషనల్ వీక్' అని అంచనా వేస్తుంటారు. అయితే, ఓ తాజా అధ్యనం ఇది కేవలం ఓ అపోహ మాత్రమే అని కొట్టిపారేసింది. తెరపై భావోద్వేగాలకు కనెక్ట్ అయ్యి కన్నీరు కార్చడాన్ని భావోద్వేగ మేధస్సు స్థాయి అధికంగా ఉండటాన్ని సూచిస్తుందని తేల్చింది. పరిశోధకులు గుర్తించిన దాని ప్రకారం.. కల్పిత పాత్రల దుఃఖాన్ని కూడా తమ సొంతంగా భావించి మమేకమయ్యే గొప్ప సామర్థ్యం ఈ వ్యక్తులలో ఉంటుందట. ఈ ప్రతిస్పందన కేవలం భావోద్వేగం మాత్రమే కాదని, దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.
న్యూరోఎకానమిస్ట్ డా.పాల్ జాక్ పరిశోధన ప్రకారం.. ఇలాంటి గాఢమైన అనుభూతి మెదడులో 'ఆక్సిటోసిన్' అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. 'కరుణ హార్మోన్'గా భావించే ఇది మనలో దయాగుణాన్ని పెంపొందిస్తుంది. ఇతరులతో సామాజిక బంధాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. వీరు నిజ జీవితంలో సంతృప్తికరమైన సంబంధాలను కలిగి ఉంటారు. భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తారు. భావోద్వేగాలను అణచివేయకుండా వ్యక్తం చేస్తారు. ఇది మానసిక బలాన్ని, లోతైన అనుభూతి సామర్థ్యాన్ని, అలాగే పరిస్థితిని అర్థం చేసుకునే తత్వాన్ని సూచిస్తుంది.