కన్నీళ్ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
పుట్టిన ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఈ భూమి మీదకు అడుగు పెడతారు. అప్పుడు మొదలైన కన్నీళ్లు చివరి శ్వాస వరకు ప్రవహిస్తూనే ఉంటాయి.
By - అంజి |
కన్నీళ్ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
పుట్టిన ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఈ భూమి మీదకు అడుగు పెడతారు. అప్పుడు మొదలైన కన్నీళ్లు చివరి శ్వాస వరకు ప్రవహిస్తూనే ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు చెంపలపై జారుతూ.. సంతోషం వచ్చినప్పుడు జలపాతంలా చెంగున దూకుతుంటాయి. ప్రతి కథలో కన్నీళ్లు ఉంటాయి.. మరి కన్నీళ్లకు కూడా ఒక కథ ఉంది అదేంటో తెలుసుకుందాం.
కంటి రెప్పల కింద వెనుక భాగంలో లాక్రీమల్ అనే కన్నీటి గ్రంథులుంటాయి. బాధ కలిగినప్పుడు నాడీ వ్యవస్థ క్రేనియల్ నరాన్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు మెదడు బాధ తాలుకా సంకేతాలను కన్నీటి గ్రంథులకు పంపుతుంది. అప్పుడు కళ్ల నుంచి కన్నీళ్లు కారుతాయి. ఈ కన్నీళ్లలో ద్రవాలు..లైసోజోమ్, లిపోకాలిన్, సోడియం, గ్లూకోజ్‌లతో పాటు ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇక మనిషి శరీరం ఏడాదికి 110 లీటర్ల వరకు కన్నీటిని ఉత్పత్తి చేస్తుంది. మొత్తం మూడు రకాల కన్నీళ్లు ఉన్నాయి.
1.బేసల్ కన్నీళ్లు..
కంటిలో దుమ్ము, ధూళి పడితే స్వీపర్ లాగా శుభ్రం చేసేది ఈ కన్నీళ్లే. అంతేకాదు కళ్లకు ఇన్ఫెక్షన్
రాకుండా బయటి నుంచి దాడి చేసే బ్యాక్టీరియాతో యుద్ధం కూడా చేస్తాయి ఈ కన్నీళ్లు. కనుగుడ్ల చుట్టూ ఈ నీళ్లు పారకుంటే మన కళ్లుపాలిపోయి మండుతుంటాయి.
2.రిఫ్లెక్స్ కన్నీళ్లు
మామూలుగా మనం ఉల్లిపాయలు కోసినప్పుడు, ఏదైనా సుగంధ ద్రవ్యాన్ని లేదా పరిమళాన్ని గాఢంగా పీల్చినప్పుడు ఈ కన్నీళ్లు తెలియకుండానే వస్తాయి. అలాగే నాలుకకు వేడి పదార్థాలు తాకినప్పుడు, వాంతులు చేసుకున్నప్పుడు.. దగ్గినప్పుడు.. ఆవలించినప్పుడు కూడా వచ్చేవి కూడా ఈ రకమే. కళ్లను రక్షించడమే వీటి ప్రధాన బాధ్యత.
3. ఎమోషనల్ కన్నీళ్లు
ఇవి పూర్తిగా భావోద్వేగాలకు సంబంధించిన కన్నీళ్లు. బాధతో ఏడ్చినప్పుడు, పట్టరాని కోపం వచ్చినప్పుడు, గాయాలైనప్పుడు, నొప్పిని భరించలేనప్పుడు ఈ కన్నీళ్లు వస్తాయి. ఈ కన్నీళ్లలో డిప్రెషన్ హార్మోన్లు ఉంటాయి. ఏడ్చినప్పుడు ఇవి బయటకుపోతాయి. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడిస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతారు. అయితే కేవలం ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ కలిగినప్పుడే కాకుండా.. పట్టరాని సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఈ ఎమోషనల్ కన్నీళ్లు వస్తాయి.