తెలంగాణలోని ఈ అందమైన గుహల గురించి మీకు తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి అందాలకు కూడా కొదువ లేదు. ఎత్తైన కొండలు, వాటర్‌ ఫాల్స్‌,

By అంజి  Published on  10 May 2023 9:30 AM GMT
tourism, chandampet caves, pilgrims, Telangana

తెలంగాణలోని ఈ అందమైన గుహల గురించి మీకు తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి అందాలకు కూడా కొదువ లేదు. ఎత్తైన కొండలు, వాటర్‌ ఫాల్స్‌, పచ్చని అడవులు వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో కళా సంపదతో పాటు అద్భుతమైన శిలా సంపద కూడా ఉంది. ముఖ్యంగా కృష్ణానదీ లోయలో నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న శిలాసంపద ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తుంది. అయితే చందంపేటలో ఉన్న శిలాసంపదైన రంగు గుహలు.. వసతులు లేక సరైన గుర్తింపుకు నోచుకోలేదు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇలాంటి గుహలు ఉన్నాయి.

చందంపేట మండలంలోని కాచరాజుపల్లికి దగ్గర ఉన్న ఈ గుట్టల్లో మునులగుహగా పిలువబడుతున్న ‘గాజుబేడం’ గుహ ఆక్వామెరీన్ (నీలి ఆకుపచ్చ) రంగుతో మెరిసిపోతున్నది. ఈ గుహలోని సొరంగాలు దాదాపు 12 కి.మీ.లు పొడవున్నాయని, వీటిద్వారా వెళితే దేవరచర్ల, ఏలేశ్వరం, శ్రీశైలం దాకా చేరవచ్చని పెద్దలు చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు. రంగుల గుహ కళ్లు చెదిరేలా కనిపిస్తుంది. ఈ గుహలోకి ప్రవేశించే మార్గం విశాలంగా ఉండటంతో పాటు ఎంతగానో అబ్బురపరుస్తుంది. ఓ చోట ఎరుపు రంగు, మరో చోట నారింజవర్ణం, నీలి ఆకుపచ్చ రంగుతో గుహల ఆకృతులు ఎంతో అందంగా కనబడతాయి.

ఈ రాతిగుహలు ఇలా ఈ రంగుతో మెరిసిపోవడానికి కారణం ఈ కొండలు అగ్నిపర్వతాలచాళ్ళు(వరుసలు) అయి ఉండాలి. విలుప్తమైన అగ్ని పర్వతంలో లావా ప్రవాహంతో ఇట్లాంటి గుహలు ఏర్పడి ఉంటాయి. లావావేడికి కరిగిన వివిధ ఖనిజాలు కలిసిపోవడంతో ప్రాకృతికంగా గుహలగోడలకు ఈ రంగులు అద్దివుంటాయి. ఈ గుహలోని రాళ్ళు ఖనిజ సంపన్న మైనవి. ఈ చందంపేట గుహలను ప్రభుత్వం గుర్తించి.. దృష్టిపెడితే రేపటి పర్యాటక సంపదకు మూల కారణం అయ్యే అవకాశం ఉంది. గుహలోని మార్గాలను అన్వేషిస్తే అనేకమైన కొత్తసంగతులు,ఆశ్చర్యపరిచే చారిత్రక విశేషాలు బయటపడే అవకాశాలున్నాయి.

Next Story