Telangana: వర్షాకాలంలో ఈ ప్రదేశాలు చూడటం అస్సలు మిస్ అవ్వొద్దు
తెలంగాణలో చాలా ప్రాంతాలు ట్రావెలింగ్ పరంగా ఫేమస్ అయ్యాయి. అందులోనూ వర్ష కాలంలో కొన్ని ప్రదేశాలకు ఎక్కువగా టూరిస్ట్‌లు వెళ్తుంటారు.
By అంజి Published on 9 July 2023 11:42 AM IST
Telangana: వర్షాకాలంలో ఈ ప్రదేశాలు చూడటం అస్సలు మిస్ అవ్వొద్దు
తెలంగాణలో చాలా ప్రాంతాలు ట్రావెలింగ్ పరంగా ఫేమస్ అయ్యాయి. అందులోనూ వర్ష కాలంలో కొన్ని ప్రదేశాలకు ఎక్కువగా టూరిస్ట్‌లు వెళ్తుంటారు. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ కాలంలో ప్రకృతి మరింత ఆకర్షణీయంగా మారుతుంది. దీంతో ఇన్ని రోజులు ఉక్కపోతతో అల్లాడినవారు వర్షాకాలంలో సేదతీరేందుకు రెడీ అవుతున్నారు. వర్షాకాలంలో ట్రిప్ వెళ్లడానికి తెలంగాణలో పలు టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. బొగత వాటర్‌ఫాల్స్
ములుగు జిల్లాలో చీకుపల్లి వాగుపై ఉన్న ఇది తెలంగాణలో అత్యంత అందమైన జలపాతాలలో ఒకటి. రాష్ట్రంలో రెండవ అతిపెద్దది. వాటర్‌ఫాల్స్ కింద ఉన్న నది మధ్యాహ్న సమయంలో ఈత కొట్టడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఈ జలపాతాన్ని సందర్శించడానికి, వాహనాన్ని పార్క్ చేయడానికి కూడా ఛార్జీలు ఉన్నాయి. ఇది వాచ్ టవర్లను కూడా కలిగి ఉంది. పిల్లల పార్కు కూడా ఉంది. దట్టమైన పచ్చని అడవుల మధ్య, కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయలతో నిండిన ఈ జలపాతం.. పర్యాటకులకు ఉల్లాసవంతమైన ప్రదేశం. ఇది హైదరాబాద్ నుండి 329 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి రైలు, బస్సుల ద్వారా చేరుకోవచ్చు.
2. కుంటాల
ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరేడికొండ ప్రాంతంలోని కుంటాల గ్రామానికి సమీపంలోని కడెం నదిపై ఉంది. 150 మీటర్ల ఎత్తు నుండి నీరు కిందకు దూకుతుంది. ఇది రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. జలపాతం చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో, అడ్వెంచర్ జంకీలకు ఇది గొప్ప హైకింగ్ ప్రదేశంగా మారింది. ముఖ్యంగా నది ఉప్పొంగుతున్నప్పుడు ఈ ప్రదేశం అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ నుండి ఇది దాదాపు 271 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో దాదాపు ఐదున్నర గంటల సమయం పడుతుంది. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి.
3. మల్లెల తీర్థం
నాగర్ కర్నూల్ జిల్లాలో అమ్రాబాద్ మండలంలోని దట్టమైన నల్లమల అడవిలో ఉన్న ఇది హైదరాబాద్ నుండి కేవలం 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. ఇక్కడ ఉన్న అడవిలో కృష్ణా నది కూడా ప్రవహిస్తుంది కాబట్టి కొన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయి. జలపాతం కోసం.. మీరు కొన్ని మెట్లు దిగవలసి ఉంటుంది. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. 500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తూ అలరిస్తుంది.
4. ముత్యాల ధార
ఈ జలపాతం ఇటీవలి కాలంలోనే ప్రసిద్ధి చెందింది. దీనిని ముత్యాల ధార, వీరబధ్రం జలపాతం అని కూడా పిలుస్తారు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. అందమైన ఎత్తైన కొండపై నుండి వస్తుంది. ఈ ప్రాంతంలో ఈదురు గాలులు వీస్తుండటంతో, పొడవాటి జలపాతం కంటికి పొడవాటి పాములా కనిపిస్తుంది. ఇది బొగత జలపాతానికి చాలా సమీపంలో ఉంది. ఇక్కడి వెళ్లాలంటే మొదట వెంకటాపురం గ్రామంలోకి వెళ్లాలి. అక్కడి నుంచి మాత్రమే మీరు దాని ఖచ్చితమైన స్థానాన్ని నిర్ధారించవచ్చు.