పండ్లు, కూరగాయల తొక్కలతో లాభాలు ఎన్నో!
Benefits of using fruit and vegetable skins are many. మనం పండ్లు కూరగాయలను కట్ చేసినప్పుడు వాటి తొక్కలను తీసి పడేస్తుంటాము.
By అంజి Published on 5 Feb 2023 6:45 PM ISTమనం పండ్లు కూరగాయలను కట్ చేసినప్పుడు వాటి తొక్కలను తీసి పడేస్తుంటాము. కానీ వాటితో చాలా ఉపయోగాలుంటాయి. వాటిలో ఆమ్లగుణాలు ఎక్కువగా ఉంటాయి. అవి క్లీనింగ్ ఏజెంట్‌గా, క్రిమి సంహారిణిగా పనిచేస్తాయి. ఇంకా ఎలా ఉపయోగపడుతాయో ఇప్పుడు చూద్దాం..
*వంటింట్లో గ్యాస్ స్టవ్ దగ్గర, సింక్ దగ్గర,కుళాయిలపై మరకలు ఎక్కువగా అవుతుంటాయి. అలాంటప్పుడు మరకలపై నిమ్మ తొక్కలతో రుద్దితే మరకలు మాయమవుతాయి. వాటిలో ఉండే ఆమ్లగుణాలు ఆయా వస్తువుల్ని కొత్తగా కనిపించేలా చేస్తాయి.
*బాత్‌రూమ్, సింక్ వద్ద బ్యాక్టీరియా, క్రిములు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించడం కోసం నిమ్మ తొక్కల్ని నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి స్ప్రేబాటిల్‌లో పోసుకొని.. సింక్, బాత్‌రూమ్‌లో స్ప్రే చేస్తూ ఉండాలి. అలా క్రిములు, బ్యాక్టీరియా అంతమవుతాయి. సువాసన కూడా వెదజల్లుతుంది.
*చర్మంపై వచ్చే అలర్జీ, దురద, మంట వంటి సమస్యలకు నిమ్మ తొక్కలతో చెక్ పెట్టవచ్చు. దీనికోసం స్నానం చేసే కొన్ని గంటల ముందు నిమ్మ తొక్కలను నీటిలో వేసి ఉంచాలి. ఆ తర్వాత వాటిని తీసేసి స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
*ముఖంపై మొటిమలు, మచ్చలు చిరాకు తెప్పిస్తాయి. అటువంటి సమయంలో పండ్లు, కూరగాయల తొక్కలను ఎండబెట్టి వాటితో పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పొడిలో కొంచెం తేనె, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, పెరుగు కలిపి ముఖానికి రాసుకొని అర్థగంట తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే మొటిమలు మాయమవుతాయి.
*ఇంట్లోకి చీమలు, బొద్దింకలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ సమయంలో కీరా తొక్కలను ఇంట్లో అక్కడక్కడా వేయాలి. ఇలా వేయడం వల్ల చీమలు, బొద్దింకలు ఇంట్లోకి రావు.
*పండ్లు, కూరగాయల తొక్కలతో సహజ ఎరువులను కూడా తయారు చేసుకోవచ్చు. దాని కోసం ముందుగా తొక్కలను కాసేపు ఎండ బెట్టి.. ఆ తర్వాత మట్టితో కలిపి కొన్నాళ్ల పాటు అలాగే ఉంచితే సహజ ఎరువు తయారవుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. భూసారం కూడా పెరుగుతుంది.
*నిమ్మ తొక్కలతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని నీళ్లలో తొక్కల్ని వేసి మరిగించాలి. ఆ తర్వాత ఒక గ్లాసులో తియ్యదనం కోసం చెంచా తేనె తీసుకొని దానిలో మరిగించిన నీటిని పోసుకోవాలి. ఈ టీ తాగడం వల్ల తలనొప్పి, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.