గర్భిణులు వీటికి దూరంగా ఉండాలి.. ఇవి బిడ్డ ఆరోగ్యానికి హానికరం
గర్భిణులు పోషకాహారం తిన్నప్పుడే పుట్టే బిడ్డ కూడా పూర్తి ఆరోగ్యంగా జన్మిస్తుంది.
By అంజి
గర్భిణులు వీటికి దూరంగా ఉండాలి.. ఇవి బిడ్డ ఆరోగ్యానికి హానికరం
గర్భిణులు పోషకాహారం తిన్నప్పుడే పుట్టే బిడ్డ కూడా పూర్తి ఆరోగ్యంగా జన్మిస్తుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బర్గర్ చీజ్, పెస్ట్రీ వంటి అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు గర్భిణులు దూరంగా ఉండాలని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఆహారాలను గర్భిణులు తీసుకోకపోవడమే ఉత్తమం అని ఎన్విరాన్‌మెంటల్ ఇంటర్నేషనల్ జర్నల్ ప్రచురించిన ఓ అధ్యయనం పేర్కొంది.
చీజ్, బర్గర్ లేదా బాక్స్‌డ్ పేస్ట్రీ.. ఇలా ఇతర ఆహార పదార్థాలను ప్యాక్ చేసి కవర్‌లు, ఆ ఆహారం తయారీ, ప్యాకింగ్ సందర్భంగా ఫుడ్‌స్టాల్ సిబ్బంది వాడే గ్లోవ్స్ ఆహారంలోకి కెమికల్స్‌ని వదులుతాయని పరిశోధకులు గుర్తించారు. గర్భిణులు ఈ ఆహారం తినేటప్పుడు ఆ రసాయనాలు తొలుత వారి రక్తప్రవాహంలోకి, తర్వాత ప్లాసెంటా ద్వారా పిండం రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు.
దీంతో పిల్లలు బరువుతో పుట్టడం, నెలలు నిండకుండానే జన్మించడం, కొన్ని మానసిక రుగ్మతలతో పిల్లలు జన్మించే ప్రమాదం ఉందని వారి అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని గర్భిణులు తీసుకుంటే రక్తంలోకి చేరే రసాయనాలు గర్భంలోని శిశువుకు ప్రమాదకరమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.