పేమెంట్లు చేయడానికి మీరు యూపీఐని ఉపయోగిస్తున్నారా? అయితే దీని వల్ల మీ ఖర్చులు మీ ఊహకు మించి పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. యూపీఐ పేమెంట్స్ చేయడం వల్ల మనకు తెలియకుండానే అనవసర ఖర్చులకు అలవాటు పడతామని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం.. యూపీఐ వాడకం వల్ల 75 శాతం మంది తమ ఖర్చు పెరిగిందని అంగీకరించారు.
59.8 శాతం మంది తమ బడ్జెట్‌ను దాటి ఖర్చు చేశామని ఒప్పుకున్నారు. లిక్విడ్ క్యాష్ ఉపయోగించినప్పుడు డబ్బ అయిపోతుందని కలిగే ఫీలింగ్ యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు కలగదని, అందువల్లే.. అనవసర ఖర్చులు పెరుగుతున్నాయని ఎక్కువ మంది చెప్పారు. ఆన్‌లైన్ పేమెంట్స్ వల్ల చెల్లింపు బాధ ఉండట్లేదని ఆర్థిక సైకాలజిస్టులు చెబుతున్నారు.
అప్పట్లో షాపులకు వెళ్లేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో అంతే డబ్బు తీసుకెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు నేరుగా బ్యాంకు నుంచే చెల్లిస్తున్నాం. కాబట్టి.. డబ్బులు ఉంటాయిలే అనే భావనతో చిన్న చిన్న ఖర్చులు చేస్తున్నాం. కానీ, ఈ చిన్న పేమెంట్లే కాలక్రమేణా మన పొదుపును మింగేస్తోందని నిపుణులు అంటున్నారు.