చికెన్‌ తింటున్నారా?.. ఇవి తెలుసుకోండి

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఇష్టంగా తినే ఆహారం చికెన్. అయితే తినే చికెన్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

By అంజి  Published on  12 Dec 2023 12:00 PM IST
chicken, India, Nonveg, Proteins in chicken

చికెన్‌ తింటున్నారా?.. ఇవి తెలుసుకోండి

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఇష్టంగా తినే ఆహారం చికెన్. యూఎన్‌వోకు చెందిన ఫుండ్‌ అండ్‌ ఆగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ అంచనా ప్రకారం.. 2021 నాటికి భారత్‌లో ఏటా చికెన్‌ వినియోగం 41 లక్షల టన్నుల కన్నా ఎక్కువగా ఉంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ప్రకారం భారత్‌లో చికెన్‌ తలసరి వినియోగం ఏటా 3.1 కిలోలుగా ఉంది. కూరగాయలు, ఆకుకూరలతో పాటు కోడిమాంసం ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటం వల్ల దీని వినియోగం ఎక్కువగా ఉంది. చికెన్‌లో ప్రోటీన్లు, శరీరానికి ప్రయోజనం కలిగించే మోనోశాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మంది ప్రజలు ఇష్టంగా తినే చికెన్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చికెన్‌ను స్కిన్‌తో పాటు తినడం మంచిదేనా?

కొందరు చికెన్‌ను స్కిన్‌తో పాటు వండుకుని తింటే.. మరికొందరు స్కిన్‌ లెస్‌ తింటారు. చికెన్‌ స్కిన్‌లో ఎక్కువ కొవ్వు ఉంటుందని దీన్ని పక్కన పెడతారు. నిజానికి చికెన్‌ స్కిన్‌లో 32 శాతం కొవ్వు ఉంటుంది. దీనిలో మూడింట రెండొంతులు మంచి కొవ్వు. మరో వంతు చెడు కొవ్వు ఉంటుంది. మంచికొవ్వు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలో మెరుగుపర్చడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ చికెన్‌ను స్కిన్‌తో పాటు కలిపి తింటే దానిలో ఉండే కొవ్వు వల్ల ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి అదనంగా చేరుతాయి. ఈ అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకూడదనుకుంటే చికెన్‌ నుంచి స్కిన్‌ను వేరు చేసి తినడం మంచిదని సూచిస్తున్నారు. ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండే వ్యక్తులు.. వండేటప్పుడు చికెన్‌ స్కిన్‌ను అలాగే ఉంచి తినేముందు తీసేస్తే మంచిది.

చికెన్‌ను మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?

షాప్‌ నుంచి చికెన్‌ తీసుకొచ్చాక చాలా మంది వండటానికి ఇంకా సమయం ఉంటే అది పాడవకుండా ఫ్రిజ్‌లో పెడతారు. వండే ముందు దానిని బయటకు తీస్తారు. అయితే కొందరు ఇలా ఫ్రిజ్‌ నుంచి బయటకు తీసి చాలా సేపు బయట ఉంచి మళ్లీ ఫ్రిజ్‌లో పెడతారు. ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే మంసాన్ని వండిన తర్వాత మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చని చెబుతున్నారు. వండిన తర్వాత అందులోని సూక్షజీవులన్నీ నశిస్తాయి.

పసుపు, గులాబీ రంగు చికెన్‌లలో ఏది మంచిది?

కోడి మాంసం రంగు అనేది కోళ్లు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కోళ్లకు మొక్కజొన్నను.. మరికొన్నింటికి జోన్నలు, గోధుమలను ఆహారంగా పెడతారు. దీన్ని బట్టి వాటి మాంసం రంగు మారుతుంది. అయితే పోషకాలపరంగా చూస్తే.. పసుపు రంగులో ఉండే చికెన్‌కు, లేత గులాబీ రంగులో ఉండే చికెన్‌కు మధ్య ఎలాంటి తేడాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏ రంగు చికెన్‌ తిన్నా ఒకేరకమైన పోషకాలు అందుతాయి.

వండే ముందు చికెన్‌ కడగకూడదా?

సాధారణంగా షాప్‌ నుంచి తీసుకురాగానే చికెన్‌ను కడుగుతుంటాం.. ఆ తర్వాతే దాన్ని వండుతాం.. కానీ ఇలా క్లీన్‌ చేయడం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగే ఛాన్స్‌ ఉందని ఫుడ్‌ స్టాండర్స్‌ ఏజెన్సీ హెచ్చరిస్తోంది. పచ్చి మంసాన్ని ట్యాప్‌ కింద కడిగేటప్పుడు దానిమీద ఉండే బ్యాక్టీరియా నీటి ద్వారా తుళ్లి ఇతర వంటపాత్రలు, మనం వేసుకున్న బట్టలు, మన చేతులపైకి చేరే ఛాన్స్‌ ఉంటుంది. అలా ఆ నీరు తుళ్లిన పాత్రల్లో ఏదైనా ఆహారం తిన్నా, మంసాన్ని కడిగిన చేతులతో ఏదైనా తిన్నా, ఆ బ్యాక్టీరియా కడుపులోకి చేరి.. అనారోగ్యం పాలవుతారు.

సరిగా ఉడకని చికెన్‌ తినొద్దు

ఎంతో ఇష్టంగా తినే చికెన్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీన్ని శుభ్రం చేసేటప్పుడు, వండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పచ్చి మాంసంలో కొన్ని రకాల హానికర బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే సరిగ్గా ఉడకబెట్టని చికెన్‌ను తింటే ఫుడ్‌ పాయిజన్‌ అవుతుంది. ఈ రకమైన చికెన్‌ను ఇతర ఆహారాలు, డ్రింకులతో కలిపి తీసుకోవడం వల్ల కూడా ఫుడ్‌ పాయిజన్‌ కావొచ్చు.

Next Story