చిరుతపులి దెబ్బకు పరీక్షలు వాయిదా.. ఎక్కడంటే
By సుభాష్ Published on 11 Jan 2020 10:47 AM ISTచిరుతపులి అంటేనే ఎవ్వరైన సరే హడలెత్తిపోతారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది చిరుత. ఇది రెప్పపాటులోనే పంజా విసిరి ప్రాణాలు తీయగల శక్తి గల జంతువు. ఇక చిరుత సంచారంతో విద్యార్థుల పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో గురువారం అర్థరాత్రి చిరుతపులి సంచరించడం కలకలం రేపింది. బాలుర వసతి గృహం వద్ద చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాన్ని వర్సిటీకి చెందిన విద్యార్థి చూసి రిజిస్ట్రార్ నసీమ్‌కు తెలియజేయడంతో, రిజిస్ట్రార్ వెంటనే అధ్యాపకులను, విద్యార్థులను అప్రమత్తం చేశారు. పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఇందల్‌వాయి అటవీ రేంజ్ అధికారులు, సిబ్బంది విద్యాలయానికి వచ్చిన వారు వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత అడుగు జాడజాడలను అన్వేషిస్తున్నారు. ఇక చిరుత సంచారంతో విద్యార్థులు భయాందోళన చెందడంతో శని, ఆదివారాల్లో జరిగే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ నసీమ్ తెలిపారు. ఈ పరీక్షలను ఈనెల 22న నిర్వహించనున్నట్లు చెప్పారు. కొన్ని రోజులుగా యూనివర్సిటీలో చిరుతపులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన పలువురికి చిరుత కంట పడటంతో భయంతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు చిరుత సంచరిస్తుండటంతో విద్యార్థులు, సిబ్బంది బయట తిరగాలంటేనే జంకుతున్నారు. ఈ చిరుత ఎక్కువగా ఎంసీఏ భవనం వద్ద తిరుగుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.
ఈ మధ్యన అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనాలు ఉండే ప్రాంతాల్లోకి చేరుకుంటున్నాయి. అడవి ప్రాంతాల్లో నీరు దొరకకనో, ఇతర కారణాల వల్లనో చిరుత పులులు జనాలు ఉండే పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో చిరుతలు ఇలా గ్రామ పొలిమెరలో సంచరిస్తుండటంపై అటవీ అధికారులు వాటిని పట్టుకుని ఇతర ప్రాంతానికి తరలించారు.