చిరుత కూనలకు ఎక్కడకు వెళ్ళాలో తెలియక.. అక్కడ ఇరుక్కుపోయాయి

By సుభాష్  Published on  10 March 2020 2:22 PM GMT
చిరుత కూనలకు ఎక్కడకు వెళ్ళాలో తెలియక.. అక్కడ ఇరుక్కుపోయాయి

రెండు చిరుత కూనలు తల్లి నుండి వేరు పడ్డాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. దీంతో ఓ చెట్టులోకి దూరిపోయాయి. బయటకు రాలేక అరవసాగాయి.. ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకుని ఎటువంటి హాని కలుగకుండా చెట్టు కాండము మధ్యలో ఉన్నటువంటి చిన్నపాటి స్థలం నుండి ఓ కూనను బయటకు తీశారు. కామారెడ్డి జిల్లాలోని భవానీపేట్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రక్షించిన కూనను హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్కులోకి తీసుకుని వెళ్లారు.

ఇసుక త్రవ్వకందార్లు ఆదివారం సాయంత్రం సమయంలో భవానీ పేట్ గ్రామంలోని తాటివాని చెరువు సమీపంలోని చెట్టు తొర్రలో చిరుత పులి పిల్లలు ఉండడాన్ని గమనించారు. దీంతో వాళ్ళు స్థానిక ప్రజలకు సమాచారం అందించారు. వారు అటవీ అధికారులకు సమాచారం అందించగా.. ఆ ప్రాంతానికి దగ్గరగా ఎవరూ వెళ్లకండని సూచించారు. ఎందుకంటే ఆ కూనలకు దగ్గరగా తల్లి తిరుగుతూ ఉండే అవకాశం ఉంది. మనుషుల మీద దాడి చేయొచ్చని భావించి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. సాయంత్రం సమయానికి అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే కేవలం ఒక్క కూన మాత్రమే అక్కడ కనిపించింది. అధికారులు ఆ ప్రాంతం మొత్తాన్ని కలియ తిరిగారు కానీ.. మిగిలిన కూన జాడ కనిపించలేదు. కామారెడ్డి డిఎఫ్ఓ జె.వసంత్ మాట్లాడుతూ దొరికిన ఆ కూనను హైదరాబాద్ లోని నెహ్రూ జూకు తరలించామని.. మిగిలిన చిరుత కూన ఆచూకీ కోసం సీసీటీవీలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని అన్నారు.

Next Story