ఏపీ శాసన మండలి రద్దుకు సంకేతాలివేనా..?

ఏపీ శాసన మండలి రద్దుకు ముహూర్తం దగ్గరపడినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే మండలి రద్దు ఖాయమనే మాట వినిపిస్తోంది. శాసన మండలి సభ్యులుగా, కేబినెట్‌ మంత్రులుగా పిల్లి సుభాష్‌, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు నామినేట్‌ చేశారు. ఇక వ్యాపారవేత్త అయిన పరిమళ్‌ నత్వానీ, అయోధ్య రామిరెడ్డిలతో పాటు పిల్లి సుభాష్‌, మోపిదేవి వెంకటరమణ కూడా తమ తమ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. కాగా, పిల్లి సుభాష్‌, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులు అయిన వెంటనే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడం ఖాయం. ఇద్దరు మంత్రులను కూడా పదవులకు రాజీనామా చేయించి పంపడానికి జగన్‌ సిద్ధమయ్యారంటే శాసన మండలి రద్దుకు కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాల వచ్చాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇప్పటికే పదవుల్లో ఉన్న నేతలను సైతం పదవులకు రాజీనామా చేయించి మరీ రాజ్యసభకు పంపడం అంటే, త్వరలో వారి పదవులు పోతాయనే ఉద్దేశంతోనే జగన్‌ అలా చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక రిలయన్స్‌ ముఖేష్‌ అంబానీ అత్యంత సన్నిహితుడైన పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ టికెట్‌ ఇవ్వడం కూడా ఈ అనుమానాలకు మరింత  బలం చేకూరుస్తున్నట్లయింది.

ఈనెలలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేవాలు జరగనున్నాయి. ఇక శాసనసభతో పాటు శాసన మండలి కూడా సమావేశం అవుతుంది. అయితే మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసింది కాబట్టి వారి దృష్టిలో కౌన్సిల్‌ లేదని, రద్దయిపోయిందని చెప్పడానికే జగన్‌ వారికి రాజ్యసభ సీటు ఇచ్చారని టాక్‌ వినిపిస్తోంది. ఏది ఏమైనా మండలి రద్దు గురించి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సంకేతాలు అందాయని రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.