హైదరాబాద్: ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ప్యాకేజ్డ్ మంచినీళ్ల సీసాలు, శీతల పానీయాలను విక్రయించినందుకు హైదరాబాద్ తుక్కుగూడలోని వైశ్రాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ పై లీగల్ మెట్రోలజీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఓ వినియోగదారుల హక్కుల కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు ఈ మేరకు ఆ రెస్టారెంట్ పై చర్య తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర తూనికలు కొలతల నిబంధనల (2011) ప్రకారం 18(2) నిబంధనను వైస్రాయ్ రెస్టారెంట్ ఉల్లంఘించినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు చెబుతున్నారు. దీనికి రూ. 2000 జరిమానా విధించే అవకాశం ఉంది.

రెస్టారెంట్ లో రూ.20లకు అమ్మాల్సిన ప్యాకేజ్డ్ మంచినీళ్ల సీసాను రూ.25లకు అమ్మడాన్ని, రూ.90 ఎమ్మార్పీ కలిగిన శీతల పానీయాన్ని రూ.100 కు అమ్మడాన్ని చూసిన వినియోగదారుల హక్కుల కార్యకర్త రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీశాడు. రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడంతో నేరుగా వెళ్లి లీగల్ మెట్రోలజీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆకస్మికంగా రెయిడ్ చేసిన లీగల్ మెట్రోలజీ శాఖ అధికారులు నేరాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు.

వైశ్రాయ్ రెస్టారెంట్ లో జరుగుతున్న అమ్మకాల అవకతవకలను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన వినియోగదారుల హక్కుల కార్యకర్త విశాల్, హైదరాబాద్ లో చాలాచోట్ల ఇలా జరుగుతోందని, ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువ ధరలకు విక్రయించే సంప్రదాయాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాల యజమానులు ఘరానాగా కొనసాగిస్తున్నారని చెప్పారు. వినియోగదారులు మేల్కొని ఎమ్మర్పీకంటే ఎక్కువ ధరకు విక్రయించేవారిని నిలదీసి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తుక్కుగూడలోని వైశ్రాయ్ రెస్టారెంట్ బిల్లుపై జి.ఎస్.టి నెంబర్ కూడా లేదని విశాల్ చెబుతున్నారు.

కిందటివారం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చాలా హోటళ్లపై ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిల్లో మూడు హోటళ్లు, రెస్టారెంట్లమీద మాత్రం అధికారికంగా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకుని ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరలకు విక్రయించే హోటళ్ల యాజమాన్యాలకు, నిబంధనలు పాటించని యాజమాన్యాలకు భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉందని లీగల్ మెట్రోలజీ శాఖ అధికారులు చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.