ఆయన ఓ లెక్చరర్.. మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Aug 2020 9:37 AM GMT
ఆయన ఓ లెక్చరర్.. మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ..!

ఖమ్మం: లాక్ డౌన్ కారణంగా చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. తమ అప్పులు తీర్చుకోడానికి, ఇల్లు గడవడం కోసం, ఈఎంఐలు కట్టుకోవడం కోసం వేరే వేరే పనులు చేసుకుంటూ ఉన్నారు. ఎంతో మంది కాయగూరలు అమ్ముతూ కనిపించారు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ లాక్ డౌన్ కష్టాల నుండి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి కథే 33 సంవత్సరాల పగిడిపల్లి రమేష్ ది..! లెక్చరర్ అయిన రమేష్ ప్రస్తుతం మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ బ్రతుకు వెళ్లదీస్తున్నాడు.

Corn

2009 సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ బీఈడీ చేసిన రమేష్.. విజయవాడలోని ఓ ప్రముఖ జూనియర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. లాక్ డౌన్ కు ముందు 30000 రూపాయల వరకూ సంపాదిస్తూ ఉండేవాడు.

లాక్ డౌన్ కావడంతో రమేష్ తో పాటూ ఇంకో 20 మందిని సదరు జూనియర్ కాలేజీ చెప్పా పెట్టకుండా విధుల నుండి తొలగించేసింది. దీంతో రమేష్ మార్చి 24న తన భార్య, అయిదేళ్ల బిడ్డతో కలిసి తన సొంత ఊరైన మధిరకు చేరుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా రమేష్ భార్య నాగమణి కూడా ఉద్యోగాన్ని కోల్పోయింది.

రమేష్ ట్యూషన్స్ చెప్పుకుంటూ జీవించాలని అనుకున్నాడు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ట్యూషన్స్ చెప్పడానికి కూడా అనుమతులు లేకపోవడంతో అది కుదరదని అర్థం అయ్యింది. విజయవాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడు రమేష్ బైక్, వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్ ను లోన్ లో తీసుకున్నాడు. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఈఎంఐలను చెల్లించలేకపోయాడు. ఇప్పటికే అతడి బైక్ ను ఫైనాన్స్ కంపెనీకి చెందిన వాళ్ళు తీసుకుని వెళ్లిపోయారు.

రమేష్ ఇక చేసేదేమీ లేక.. పరిస్థితుల్లో ఎప్పుడు మార్పులు వస్తాయో తెలీక మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ జీవిస్తూ ఉన్నాడు. తక్కువ పెట్టుబడి కావడంతో ఈ వ్యాపారం చేస్తున్నానని రమేష్ తెలిపాడు. 200 నుండి 400 వరకూ సంపాదిస్తూ ఉన్నానని రమేష్ తన పరిస్థితిని వివరించాడు. ఏది ఏమైనా లాక్ డౌన్ ఎంతో మంది జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకుని వచ్చింది.

Next Story