లక్ష్మీపార్వతికి కీలక పదవి.!

By Medi Samrat  Published on  6 Nov 2019 1:06 PM GMT
లక్ష్మీపార్వతికి కీలక పదవి.!

ముఖ్యాంశాలు

  • తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియామ‌కం
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ స‌తీమ‌ణి, వైసీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో నం. 180 ద్వారా బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.

పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ సాగుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ....మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ముందుంటున్నారు. కుల,మతాలకు అతీతంగా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కర్నీ గుర్తు పెట్టుకుని మరీ పదవులు అప్పగిస్తున్నారు. దళిత శాసనసభ్యురాలికి ఏకంగా కీలకమైన హోంమంత్రి పదవి ఇచ్చి గుర్తించిన సీఎం వైఎస్ జగన్....అదే కేబినెట్ లో ఎస్ టీ మహిళను డిప్యూటీ సీఎంగా చేసి అరుదైన రికార్డు నెలకొల్పారు.

కేబినెట్ తో మొదలుపెట్టిన వైసీపీ సర్కార్ మహిళా చైతన్యం....అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు...ప్రైవేట్ అయినా ప్రభుత్వానికి సంబంధించిన కమిటీ అయినా సరే మహిళలకు 50 శాతం అవకాశం కల్పించాలంటూ ఉత్వర్వులు జారీ చేసి సంచలనానికి తెరదీశారు వైఎస్ జగన్. మహిళా శాసనసభ్యురాలు, పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్ కే రోజాకు కీలకమైన ఏపీఐసీసీ సంస్థ ఛైర్మన్ పదవిని అప్పగించారు. ఇక పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అధికార ప్రతినిధి హోదాలో అప్పటి అధికార పార్టీ తప్పుఒప్పులపై మాటల దాడి చేసిన వాసిరెడ్డి పద్మకు కూడా ఇటీవలే న్యాయం చేశారు.

ఆమెకు ఏకంగా ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు తాజాగా లక్ష్మీపార్వతికి మంచి పదవితో సత్కరించారు. ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ పదవీ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగులో పీహెచ్ డీ చేసిన లక్ష్మీపార్వతి ...వైసీపీ పెట్టిన కొన్నాళ్లకు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొద్దిరోజులకే అధికార ప్రతినిధి పదవిని ఇచ్చారు. స్పోక్స్ పర్సన్ పదవిలో టీడీపీ ప్రభుత్వంపై ఎన్నో మార్లు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చంద్రబాబు టార్గెట్ గా లక్ష్మీపార్వతి చేసిన కామెంట్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాయి.

నిజానికి 2019 ఎన్నికల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మీపార్వతికి ఏదో పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకు లక్ష్మీపార్వతికి పదవి దక్కింది. పదవి ఇవ్వడంపై లక్ష్మీపార్వతి సంతోషం వ్యక్తం చేశారు. తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని తెలిపారు.

Next Story