భారత్‌లో 24గంటల్లో 66,999 పాజిటివ్ కేసులు.. 942 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2020 11:17 AM ISTభారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో 66,999 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 942 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర, వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,638కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 16,95,982 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 6,53,622 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 47,033 మంది మృత్యువాత పడ్డారు.
నిన్న ఒక్కరోజే 8,30,391 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 2,68,45,688 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 70 శాతం ఉండగా.. మరణాల రేటు 2 శాతంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో నాలుగో స్థానానికి చేరుకుంది.