జగన్ అలా అనడంలో తప్పులేదు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
By సుభాష్ Published on 30 April 2020 6:47 PM ISTఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక కరోనాను కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సమర్దించారు. ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో ఏపీ రాష్ట్ర పరిస్థితులు, సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని, ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ అభిప్రాయపడ్డారని, కరోనా కూడా జ్వరం వంటిదేనంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి తప్పులేదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
ఇంట్లో కొడుకుకు జ్వరం వస్తే తగ్గిపోతుందిలే అంటూ తండ్రి ధైర్యం చెబుతారని, రోగికి మానసిక బలం, ధైర్యం చెప్పడం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో భయపడాల్సిన అవసరం లేదని చెప్పడంలో తప్పేమిలేదని వ్యాఖ్యానించారు. సీఎం ఇలా భరోసా ఇచ్చినా.. కొంత మంది ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు ర్యాలీలు, సభలు పెట్టడం సరైంది కాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఇలా నేతలు బయటకు రావడం వల్ల .. తాము కూడా బయటకు వస్తే ఏమవుతుందిలే అని జనాలు కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులు పెరిగినా.. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నాయని గుర్తించుకోవాలన్నారు. కరోనాతో మరణించిన వారు ఎక్కువగా వృద్దులే ఉన్నారని, వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయని, అలాగే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పరీక్షల సంఖ్య పెంచాలన్నారు.
లాక్‌డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను ఇచ్చిందని, వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారని, వారిని తరలించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వారిని తరలించే బస్సులను సైతం శానిటైజర్ చేయాలని, సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ కోరారు.
ఇక కూలీలు సొంత ఊళ్లకు వెళ్లిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించాలని, పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించాలన్నారు. ఇక దేశ వ్యాప్తంగా రెడ్ జోన్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఉన్నాయని, వాటిపై దృష్టి సారిస్తే బాగుంటుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.