Fact Check : చంకలో బిడ్డను పెట్టుకుని రోళ్లను అమ్మిన మహిళ.. సి.ఐ. అయిందా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Nov 2020 2:47 PM GMTఓ మహిళ తల మీద రోళ్లు పెట్టుకుని, చంకలో బిడ్డను పెట్టుకుని ఉన్న ఫోటో.. మరో వైపు పోలీసు డ్రెస్ లో ఉన్న ఫోటో. ఈ రెండు ఫోటోల్లో ఉన్నది ఒక్కరే అన్న ప్రచారం జరుగుతోంది. చంకలో బిడ్డను పెట్టుకుని.. రోళ్లను అమ్ముతూ బ్రతికిన అమ్మాయి.. బాగా చదివి ఎస్.ఐ. అయిందంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆమె మహిళా పోలీసు అయిందంటూ పలువురు షేర్ చేస్తూ ఉన్నారు.
"నెత్తిమీద రోళ్లు.. చంకలో బిడ్డ.. కష్టపడి చదివి ఎస్సై అయింది.. చేతిలో బిడ్డ, తలపై రోళ్లు పెట్టి అమ్ముతున్న ఈ అమ్మాయి పేరు పద్మశిల. ఇంతకీ ఈ అమ్మాయి స్పెషాలిటీ ఏంటో తెలుసా. ఇంత కష్టపడుతున్న ఈ అమ్మాయి డిగ్రీ చదువుకుంటోంది. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి ఇప్పుడు ఎస్సై అయింది. బాగా చదువుకుని కూడా కుటుంబాన్ని, బిడ్డని పోషించుకునేందుకు తలపై రోళ్లు పెట్టుకుని వీధి వీధీ తిరిగి అమ్ముకుంటూ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి పాసైంది. ఇటువంటి యువతులే నిజంగా ఆదర్శ ప్రాయులు." అంటూ పెట్టిన పోస్టులు వైరల్ అవుతూ వచ్చాయి.
నిజ నిర్ధారణ:
రోళ్లను అమ్ముతూ తన జీవనం సాగిస్తున్న మహిళ.. లేడీ ఇన్స్పెక్టర్ అయ్యిందని.. రెండు ఫోటోల్లో ఉన్న మహిళ ఒక్కరేనని వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ రెండు ఫోటోలలో ఉన్న వ్యక్తులు వేరు వేరు..! ఈ ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆ ఫోటోలో ఉన్న పోలీసు మహిళ 'పద్మశిల తిర్పూడే'. ఆమె ఎంతో కష్టపడి పోలీసు ఇన్స్పెక్టర్ అయ్యారు. ఆమె సాధించిన ఘనత మీద ఎన్నో మరాఠీ ఛానల్స్ లో వార్తలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం నాగపూర్ జిల్లాలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ ఉన్నారు. వైరల్ అవుతున్న ఈ పోస్టులపై ఆమె కూడా స్పందించారు. తాను రోళ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేదాన్నంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. 'నా గత చరిత్ర గురించి చాలా తప్పుగా చెబుతూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారని' ఆమె Maharashtra Times కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
పద్మశిల భండారా జిల్లాకు చెందిన మహిళ. 2009 లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తీ చేయగా.. 2013లో సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు. ఆ సమయంలోనే ఆమె ఫోటోను తీశారు. రాళ్లు అమ్ముతున్న మహిళ పోలికలు కొంచెం తనలాగే ఉన్నాయని.. కానీ రాళ్లు అమ్ముకునే మహిళ తానేనంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు.
రోళ్లను అమ్ముతున్న మహిళకు సంబంధించిన ఫోటో ఫేస్ బుక్ లో లభించింది. Zindagi images అనే ఫేస్ బుక్ గ్రూప్ లో ఈ ఫోటోలను పోస్టు చేశారు. జులై 2017లో సురేష్ గుండేటి అనే వ్యక్తి ఈ ఫోటోను తీసాడు. తెలంగాణ రాష్ట్రంలోని కోరట్ల ప్రాంతానికి చెందిన మహిళ ఆమె అని వెల్లడించాడు.
కింది లింక్ లో ఆ మహిళకు సంబంధించిన వివరాలను సురేష్ వెల్లడించడం గమనించవచ్చు.
ఈ వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని Alt news, Vishvas news కూడా వెల్లడించాయి.
రోళ్లను అమ్ముకుంటూ జీవనం సాగించిన మహిళ సబ్-ఇన్స్పెక్టర్ అయ్యిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.