తామెక్కడ బతకాలి.. మాకు మరో దారి లేదు.. మా ఉద్దేశం అది కాదు

యావత్‌ ప్రపంచాన్నే కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వైరస్‌ విజృంభణతో అన్ని దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని, స్వీయం నిర్బంధంలోకి వెళ్లాలని సూచిస్తున్నాయి. మన భారత్‌లోనూ ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు. దీంతో దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు చాలా కంపెనీలను మూసివేశారు. చిన్న చిన్న పరిశ్రమలు మూత పడ్డాయి. బతుకు దెరువు కోసం నగరాలకు వచ్చిన నిరుపేద కుటుంబాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది.

పని లేకపోవడంతో పట్టణాల్లో బతికేంత డబ్బులు లేక, ఇటు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించడంతో చాలా మంది పేద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కొంత మంది కూలీలు బతుకు దెరువు కోసం వచ్చి అక్కడే చిక్కుకుపోయారు. ఆ కూలీలు అక్కడ ఉన్న ఓ స్టీల్‌ ఫ్యాక్టరీలో పని చేసేవారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆ ఫ్యాక్టరీని యాజమాన్యం మూసివేసింది. దీంతో అప్పటిదాకా వారితో పని చేయించుకున్న యాజమాన్యం వారిని గెంటేసింది. లక్నో నుంచి 80 కిలో మీటర్ల దూరంగల బారాబంకికి చెందిన ఆ కూలీలకు అక్కడ నిలవ నీడ లేకుండా పోయింది. సొంతూరికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అప్పటికే పూర్తిగా ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది. కాలినడకన 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబంకికి వెళ్లేందుకు ఆ కూలీలు సిద్ధమయ్యారు.

వెంటనే తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అంతకుముందు ఓ కిరణా షాపులో బిస్కట్ల పొట్లాలు కొనుక్కున్నారు, తాగడానికి మంచినీళ్లు బ్యాగులో పెట్టుకున్నారు. తాము వెళ్లే దారిలో పోలీసులు పహారా కాస్తారని తెలిసినా వారు అక్కడి నుంచి బయల్దేరారు. తమ ప్రయాణానికి 36 గంటల సమయం పడుతుందని ఆ కూలీలు ఓ మీడియా సంస్థకు చెప్పారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా తమ ప్రయాణం సజావుగా సాగితే గురువారం ఉదయం నాటి తమ ఊరికి చేరుకుంటామని ఆశా భావం వ్యక్తం చేశారు ఆ కూలీలు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పాటించకుండా రోడ్ల మీదకు రావడం తప్పు కదా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. కంపెనీ మూత పడింది, రోడ్లపై పోలీసులు ఉండనివ్వరు.. మరీ తామెక్కడ ఉండాలని ఓ 20 ఏళ్ల కూలీ ఎదురు ప్రశ్నించాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకోవాలనేది తమ ఉద్దేశం కాదన్నాడు. అయితే మరో దారి ఏది కనబడలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కూలీల్లో 50 ఏళ్లకు పైబడిన వారు కూడా ఉండటం చాలా బాధకరమైన విషయం.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *