చెన్నైలో నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్
By సుభాష్ Published on 27 Oct 2020 5:17 AM GMTసినీ నటి, బీజేపీ నేత కుష్బూను పోలీసులు అరెస్ట్ చేశారు. వీసీకే అధినేత తిరుమావళవన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కుష్బూ నేతృత్వంలోని బీజేపీ నేతలు మంగళవారం నిరసన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో చెన్నై నుంచి చిదంబరంకు ప్రయాణిస్తుండగా ముత్తుకాడు సమీపంలో వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కుష్బూతో పాటు మరి కొంత మంది మహిళానేతలు, ఇతరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో గౌడంబాడిలో వీసీకే, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఈ ఘర్షణలో పలు వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా పోలీసులు 15 మంది బీజేపీ నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇటీవలే కాగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కుష్బూ బీజేపీలో చేరారు. నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
కాగా, తిరుమావళవన్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మనస్మృతి, మహిళల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారని కుష్బూ ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశామని, తన చివరి శ్వాస వరకు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తానని కుష్బూ ట్వీట్ చేశారు.