బండి సంజయ్ అరెస్ట్.. దుబ్బాకలో ఉద్రిక్తత‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2020 4:29 PM GMT
బండి సంజయ్ అరెస్ట్.. దుబ్బాకలో ఉద్రిక్తత‌

దుబ్బాక ఉప‌పోరు ఒక్కసారిగా హీటెక్కింది. ఉప ఎన్నిక బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించడంతో.. నిన్న‌టి వ‌ర‌కూ ప్ర‌చార ఆర్భాటాల‌కే ప‌రిమిత‌మైన ఎన్నిక.. నేడు ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మారింది.

ఈ నేఫ‌ధ్యంలోనే ‌దుబ్బాక వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సమయంలో బండి సంజయ్‌కు గాయాలయ్యాయి. తట్టుకోలేని ఆయన గట్టిగా కేకలు పెట్టారు. ఈ సందర్భంగా అక్క‌డ తీవ్ర‌‌ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అంత‌కుముందు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలను బండి సంజయ్ ఖండించారు. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో సోదాలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం దుందుడుకు చర్య అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు నివాసంతో పాటు కార్యాలయం, ఆయన బంధువు ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు. ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇంటి ముందే బైఠాయించి రఘునందన్ తన నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు.

Next Story