బాబుకు షాకింగ్ గా మారిన కుప్పం కదలికలు
By సుభాష్ Published on 24 July 2020 12:08 PM ISTఊహించని రీతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక పట్టాన మింగుడుపడటం లేదా? అంటే అవునని చెబుతున్నారు. ఇప్పటివరకూ తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు హ్యాండిచ్చి బాబును వదిలేసి వెళ్లిపోవటం ఒక ఎత్తు అయితే.. బాబు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారటం.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కొత్త టెన్షన్ పుట్టిస్తున్నట్లు చెబుతున్నారు.
కుప్పానికి చెందిన టీడీపీ ముఖ్యనేతలు.. వీరాభిమానులు ఒకరు తర్వాత ఒకరు చొప్పున అధికారపక్షంలోకి చేరుతున్న వైనంతో బాబుకు షాకింగ్ మారుతోంది. తనకెంతో వీరాభిమానులైన వారు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా చెంతకు వెళ్లిపోవటంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు బాబు. అయినప్పటికీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవటం గమనార్హం.
జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్నిస్వయంగా అందుకుంటున్న టీడీపీ చోటా నేతలు.. ఇప్పుడు జగన్ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో బాబుకు కంచుకోటగా చెప్పే కుప్పంలో టీడీపీ కోట నిలువునా చీలుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. బాబు ప్రభుత్వంలో తమకు అందని సంక్షేమ పథకాలు అందుకు భిన్నంగా జగన్ సర్కారులో అందటంతో కింది స్థాయి కార్యకర్తలు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు.
దీంతో.. పలువురు చోటా నేతలు నెమ్మదిగా తమ కార్యకర్తలతో కలిసి అధికారపార్టీలోకి చేరటం బాబుకు మింగుడుపడని వ్యవహారంగా మారిందంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ నుంచి బయటకు వచ్చేశారని చెబుతున్నారు. దీంతో.. హుటాహుటిన కొందరునేతల్ని కుప్పంకు బాబు పంపారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. తెలుగు తమ్ముళ్లను కలిసేందుకు ఇష్టపడటం లేదని.. ముఖం చాటేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ పరిస్ధితి అయోమయంగా ఉన్న వేళ.. తన సొంత అడ్డాలోనే వస్తున్న మార్పులు బాబుకు ఒక పట్టాన మింగుడుపడటం లేదని చెబుతున్నారు.